ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. ౭ గురు మరణించారు. 440 మందికి పైగా గాయపడ్డారు.
స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి టర్కీ సరిహద్దుల్లోని ఖోయ్ సిటీ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ ప్రకంపనల కారణంగా పెద్ద సంఖ్యలో భవనాలు నేల మట్టం అయ్యాయి. పలువురు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీయగా.. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, రెస్య్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 7 గురు మృతి చెందగా 440 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని బావిస్తుండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
భూప్రకంపనల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భూ కంపం సంభవించిన కొన్ని ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలతో పాటు భారీగా మంచు కురుస్తోంది. ఫలితంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్లు ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిథి ముజ్తబా ఖలేదీ తెలిపారు.