కరాచీ పోలీస్ స్టేషన్‌లో కాల్పులు.. ఐదుగురు పాకిస్థానీ తాలిబన్ ఉగ్రవాదులు సహా 9 మంది మృతి
5 Pakistani Taliban militants among 9 killed in Karachi police station attack. తెహ్రీక్-ఎ-తాలిబాన్ (పాకిస్థాన్)కి చెందిన సాయుధ ఉగ్రవాదులు శుక్రవారం కరాచీ పోలీస్ చీఫ్
By అంజి Published on 18 Feb 2023 10:07 AM ISTతెహ్రీక్-ఎ-తాలిబాన్ (పాకిస్థాన్)కి చెందిన సాయుధ ఉగ్రవాదులు శుక్రవారం కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంపైకి చొరబడి కాల్పులు జరిపారు. కరాచీ పోలీస్ చీఫ్ హెడ్ ఆఫీస్ భవనంపై తిరిగి నియంత్రణ సాధించగలిగిన భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులతో సహా తొమ్మిది మంది మరణించారు. ఈ కాల్పుల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఒక రేంజర్స్ సిబ్బంది, ఒక పౌరుడు సహా మరో నలుగురు వ్యక్తులు మరణించారు. 17 మంది గాయపడినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. కరాచీలోని షరియా ఫైసల్‌లో ఉన్న పోలీసు చీఫ్ కార్యాలయంలోకి కనీసం ఎనిమిది మంది సాయుధ ఉగ్రవాదులు ప్రవేశించారు. ఈ ఆపరేషన్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు సీనియర్ భద్రతా వర్గాలు పిటిఐకి తెలిపాయి. సుదీర్ఘ కాల్పుల్లో ముగ్గురు మరణించగా, ఇద్దరు తమను తాము పేల్చేసుకోవడం వల్ల భవనంలోని ఒక అంతస్తుకు కొంత నష్టం వాటిల్లింది. ఐదంతస్తుల భవనాన్ని క్లియర్ చేసేందుకు భద్రతా అధికారులు ప్రయత్నించగా, పోలీసు చీఫ్ కార్యాలయం లోపల నుంచి పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.
శక్తివంతమైన పేలుడు ధాటికి సమీపంలోని భవనాల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దాదాపు నాలుగు గంటల పాటు భవనాన్ని సీజ్ చేశారు. ఘటనా స్థలం నుండి వీడియోలలో అనేక రౌండ్ల తుపాకీ కాల్పుల శబ్దాలు వినబడుతున్నాయి. భవనం లోపల పేలుడు జరిగిన క్షణాన్ని కూడా ఒక వీడియో చూపిస్తుంది. కరాచీ పోలీస్ ఆఫీస్ భవనం క్లియర్ చేయబడిందని తాను ధృవీకరించగలనని సింధ్ ప్రభుత్వ ప్రతినిధి ముర్తజా వహాబ్ ట్విట్టర్‌లో తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు.
ఇద్దరు పోలీసులు, రేంజర్స్ సిబ్బంది, ఒక పౌరుడితో కూడిన మరో నలుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది గాయాలతో ఆసుపత్రిలో చేరారు. స్థానిక మీడియా నుండి వచ్చిన నివేదికల ప్రకారం.. హ్యాండ్ గ్రెనేడ్లు, ఆటోమేటిక్ గన్లను ఎనిమిది మంది ఉగ్రవాదులు ఉపయోగించారు. దాడి తరువాత, కరాచీ పోలీసులు, పాకిస్తాన్ రేంజర్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. భవనం వెనుక ద్వారం వద్ద ఒకటి, ముందు వైపు రెండు కార్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి 7.10 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు వచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి, దక్షిణాది డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు.