ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. తీవ్ర‌త ఎంతంటే..?

ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.2 గా న‌మోదు అయిన‌ట్లు NCS తెలిపింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 March 2023 7:59 AM IST
Earthquake, Afghanistan

ప్ర‌తీకాత్మ‌క చిత్రం


ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దీని తీవ్ర‌త 4.2 గా న‌మోదు అయిన‌ట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది. బుధ‌వారం తెల్ల‌వారుజామున 1.40 గంట‌ల‌కు కాబూల్‌లో ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. భూమి నుంచి 136 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయిన‌ట్లు వెల్ల‌డించింది. అయితే.. ఈ ప్ర‌కంప‌న‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్రాణ‌, ఆస్తి న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాచారం అంద‌లేద‌ని అధికారులు తెలిపారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో భూమి కంపించడం ఈ నెల‌లో ఇది రెండో సారి. అంతకుముందు మార్చి 2 న ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్ ప్రాంతంలో తెల్లవారుజామున 2:35గంట‌ల స‌మ‌యంలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం 245 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్ర కేంద్రీకృత‌మై ఉంది.

నికోబార్ దీవుల్లోనూ..

మంగళవారం(మార్చి 6) నికోబార్ దీవుల ప్రాంతంలో భూమి కంపించింది. మంగ‌ళ‌వారం ఉద‌యం 5 గంట‌ల ప్రాంతంలో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5గా నమోదైంది. భారత్, ఇండోనేషియా రెండు దేశాల్లో భూమి కంపించింది.

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో ప్రకంపనలు

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో మంగళవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైంది. అమెరికన్ జియోలాజికల్ సర్వే ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప కేంద్రాన్ని మిండనావో ద్వీపంలోని దావో డి ఓరో ప్రావిన్స్‌లో గుర్తించారు. ఇక్కడ కూడా ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Next Story