టర్కీలో మ‌ళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి, 213 మందికి గాయాలు

3 dead, over 200 injured as new quake hits Turkey, Syria. ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ దేశంలో మళ్లీ భూకంపం

By అంజి  Published on  21 Feb 2023 4:25 AM GMT
టర్కీలో మ‌ళ్లీ భూకంపం.. ముగ్గురు మృతి, 213 మందికి గాయాలు

ఇప్పటికే భారీ భూకంపంతో అతలాకుతలమైన టర్కీ దేశంలో మళ్లీ భూకంపం సంభవించింది. సోమవారం అర్థరాత్రి రెండు భూకంపాలు వచ్చాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. సిరియా సరిహద్దు సమీపంలో ఉన్న హటాయ్‌ ప్రావిన్స్‌లో రెండుసార్లు భూమి కంపించింది. మొదటి భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా చూపించింది. తర్వాతి భూకంపం 5.8 తీవ్రతతో వచ్చినట్లు అధికారులు తెలిపారు. నిన్న వ‌చ్చిన భూకంపాల వల్ల బ‌ల‌హీనంగా ఉన్న బిల్డింగ్‌లు కుప్ప కూలాయి.

మొదటి భూకంపం రాత్రి 8.04 నిమిషాల‌కు వ‌చ్చింది. ఆ త‌ర్వాత మూడు నిమిషాలు మ‌రో సారి భూమి కంపించింది. అంట‌క‌య్యా, డెఫ్ని, స‌మన్‌డ‌గ్ ప్రావిన్సుల్లో ముగ్గురు మ‌ర‌ణించిన‌ట్లు మంత్రి సులేమాన్ తెలిపారు. తాజా భూకంపంలో సుమారు 213 మంది గాయ‌ప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. కూలిన మూడు భవనాల్లో ఆరుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు భావించిన రెస్క్యూ టీమ్‌.. సహాయక చర్యలు కొనసాగిస్తోంది. పొరుగున ఉన్న సిరియాలో కూడా అనేక భవనాలు కూలిపోయాయి. కొంతమంది వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నారు.

మరోవైపు ఈ నెల మొదటి వారంలో వచ్చిన భూకంపం కారణంగా టర్కీలో మరణించి వారి సంఖ్య 45 వేలు దాటింది. ఇక్కడ లక్షన్నర మందికి పైగా ప్రజలు తాత్కాలిక ఆశ్రయాల్లో ఉన్నారు. టర్కీ అధికారులు అప్పటి నుండి 6,000 కంటే ఎక్కువ అనంతర ప్రకంపనలను నమోదు చేశారు. సోమవారం నాటి భూకంపం వల్ల తాము హింసాత్మకంగా కుప్పకూలామని, పడిపోకుండా ఒకరినొకరు పట్టుకున్నామని హటే నుండి రిపోర్టింగ్ చేస్తున్న హేబర్‌టర్క్ జర్నలిస్టులు తెలిపారు.

Next Story