అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. మిచిగాన్‌లో ఓ 15 ఏళ్ల విద్యార్థి తన చదువుతున్న ఉన్నత పాఠశాలలో మంగళవారం కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఒక అమ్మాయి ఉంది. అలాగే ఒక ఉపాధ్యాయుడు సహా మరో ఆరుగురికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. డెట్రాయిట్‌కు ఉత్తరాన దాదాపు 30 మైళ్ల (48 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఆక్స్‌ఫర్డ్ టౌన్‌షిప్‌లోని ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో విద్యార్థి కాల్పులు జరిపాడు. కాల్పుల దాడికి దుండగుడి ఉద్దేశాలు ఏమిటో తమకు తెలియదని ఓక్లాండ్ కౌంటీ అండర్‌షెరీఫ్ మైక్ మెక్‌కేబ్ చెప్పారు. ఈ ఘటనపై మధ్యాహ్నం 12:55 గంటలకు తమకు సమాచారం అందిందని వివరించారు.
అధికారులు పాఠశాలలో అనుమానితుడిని అరెస్టు చేశారు. సెమీ ఆటోమేటిక్ హ్యాండ్‌గన్ మరియు అనేక క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నారు. "అధికారులు అతనిని ఎదుర్కొన్నారు, అతని వద్ద ఆయుధం ఉంది, వారు అతనిని అదుపులోకి తీసుకున్నారు," అని మెక్‌కేబ్ చెప్పాడు. అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు అనుమానితుడు గాయపడలేదని, అతను పాఠశాలలోకి తుపాకీని ఎలా తీసుకువచ్చాడో చెప్పడానికి నిరాకరించాడని తెలిపారు. బాధితుల పేర్లను అధికారులు వెంటనే విడుదల చేయలేదు. దాదాపు 1,700 మంది విద్యార్థులు ఈ పాఠశాలకు హాజరవుతున్నారు.