రష్యా దేశంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు.
సైబీరియాలోని కెమెరోవో నగరంలోని ఓ వృద్ధుల గృహంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే 20 మంది వృద్ధులు సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో భవనంలోని రెండో అంతస్తు మొత్తం కాలిపోయిందని ఫైర్ సేఫ్టీ అధికారి తెలిపారు. చాలా కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు.
శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉంటారేమోనన్న అనుమానంలో తీవ్రమైన చలిగాలుల మధ్య సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో వృద్దాశ్రమం నిర్వహించడానికి ఎలాంటి అనుమతులు లేవన్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే చాలా మంది వృద్దాశ్రమాలను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. దీంతో అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్నారు. వీటిని ప్రైవేటు ఆస్తిగా చూస్తున్నట్లు చెప్పారు.