వారం రోజుల్లో 17000 సార్లు భూమి కంపించింది.. విస్ఫోటనం తప్పదా..?
17,000 earthquakes hit Iceland in the past week. An eruption could be imminent. ఐస్ ల్యాండ్ లోని రెక్జేన్స్ పెనిన్సులా ప్రాంతంలో గత వారం రోజుల్లో 17000 సార్లు భూమి కంపించింది.
By Medi Samrat Published on 7 March 2021 7:25 AM GMTఒక్కసారి భూమి కంపిస్తేనే జనం భయంతో వణికిపోవడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా 17వేల సార్లు భూమి కంపించింది. ఐస్ ల్యాండ్ లోని రెక్జేన్స్ పెనిన్సులా ప్రాంతంలో గత వారం రోజుల్లో భూమి కంపించింది. ఇలా భూమి పొరల్లో ఇలా కంపించడానికి కారణం 'కృసువిక్ అగ్నిపర్వతం' విస్ఫోటనం చెందే అవకాశం ఉందని నిపుణులు అంటూ ఉన్నారు.
అగ్నిపర్వతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెక్జావిక్ నగరం కూడా ఈ ప్రకంపనలు ఎదుర్కొంది. ఈ భూప్రకంపనలలో పెద్దది 5.6 మ్యాగ్నిట్యూడ్ తో రిక్టర్ స్కేల్ మీద నమోదైందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24న ఈ అతిపెద్ద భూప్రకంపన అన్నది నమోదైంది. ఫిబ్రవరి 27, మార్చి 1న నమోదైన భూకంపాలు కూడా 5.0 కంటే పైనే ఉన్నాయని అధికారులు తెలిపారు.
సాధారణంగా ఈ ప్రాంతంలో సంవత్సరానికి 1000కి పైగా భూప్రకంపనలు వస్తూ ఉంటాయి. కానీ ఒక్క వారంలోనే 17000 సార్లు భూమి కంపించడం అత్యంత అరుదు అని నిపుణులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 6.0 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ భూమి కంపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐస్ ల్యాండ్ భౌగోళిక పరిస్థితుల కారణంగా కూడా ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు సాధారణమే..!
ఇక ఆ ప్రాంతంలో కొన్ని అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ భూప్రకంపనలకు కారణం రాబోయే రోజుల్లో అగ్నిపర్వతం బద్దలయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అగ్ని పర్వతం బద్దలై లావా వెదజల్లితే ఏ టౌన్ కు కూడా ప్రమాదం పొంచి ఉండలేదని ఐస్ ల్యాండ్ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంటర్నేషనల్ విమాన ప్రయాణాలకు ఎటువంటి ఇబ్బంది రాదని అంటున్నారు. కేవలం కొన్ని రోడ్డు మార్గాలు మూసి వేయడం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే ఐస్ ల్యాండ్ ప్రభుత్వం ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకుంది. సర్వేలైన్స్ ఎక్విప్ మెంట్, జీపీఎస్, ఎర్త్ క్వేక్ మానిటరింగ్ సిస్టమ్స్, వెబ్ కెమెరాలను, గ్యాస్ డిటెక్టర్లను సిద్ధం చేసుకుంది. అగ్నిపర్వతం బద్దలయ్యే ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రజలను కూడా అధికారులు హెచ్చరించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపారు.