ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో వెలుతున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 17 మంది దుర్మరణం చెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. తఖర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది.
తఖర్ ప్రావిన్స్‌లోని చాహ్ అబ్ జిల్లా నుంచి అంజీర్ ప్రాంతంలోని బంగారు గనికి బస్సు వెలుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా గనుల నుంచి బంగారం వెలికితీసే కార్మికులు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు అక్కడకు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు తాలిబాన్ పాలన ద్వారా నియమించబడిన చాహ్ అబ్ జిల్లా గవర్నర్ ముల్లా జమానుద్దీన్. మృతులంతా బంగారు గని కార్మికులు అని తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. సరైన రోడ్లు లేకపోవడం, నాసిరకమైన రోడ్ల నిర్మాణం, నిర్వహణ వైఫల్యం వంటి కారణంగా ప్రమాదాలు సాధారణంగా మారాయి. 202లో 6,033 మంది ప్రమాదాల్లో మరణించారు.