ఈశాన్య చైనాలోని ఓ రెస్టారెంట్‌లో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సెకన్ల వ్యవధిలో రెస్టారెంట్ అంతటా మంటలు వ్యాపించాయి. ప్రమాదం సంభవించడంతో రెస్టారెంట్‌లో ఉన్న వారందరూ బయటకు రావడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. చాంగ్‌చున్ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో మధ్యాహ్నం 12:40 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక ప్రభుత్వం వీబో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసిన ప్రకటనలో తెలిపింది.
విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదం ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కైరోలోని కాప్టిక్ చర్చిలో మంటలు చెలరేగడంతో 41 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడినట్లు ఈజిప్ట్ అధికారులు వెలల్డించారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. అధికారులు ఈ ఘటనపై విచారణ జరపుతున్నారు.