కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది స‌జీవ ద‌హ‌నం

15 Killed in overnight fire at cafe in Russia's Moscow.ర‌ష్యా దేశంలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Nov 2022 2:01 PM IST
కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది స‌జీవ ద‌హ‌నం

ర‌ష్యా దేశంలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో 15 మంది మ‌ర‌ణించారు. మ‌రో ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాలు ఇలా ఉన్నాయి. కోస్ట్రోమా నగరంలోని పోలిగాన్ కేఫ్‌లో శనివారం తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు కోస్ట్రోమా ప్రాంత గవర్నర్ సెర్గీ సిట్నికోవ్ తెలిపారు. ఈ ప్ర‌మాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మ‌రో ఐదుగురు గాయ‌ప‌డ్డారు. అగ్నిప్రమాదంపై స‌మాచారం అందుకు వెంట‌నే అధికారులు, అగ్నిమాప‌క సిబ్బంది అక్క‌డ‌కు చేరుకున్నారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయ‌ప‌డిన వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఎవ‌రో ఫ్లేర్ గన్‌ని ఉప‌యోగించ‌డంతోనే మంట‌లు చెల‌రేగిన‌ట్లు అధికారులు భావిస్తున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో కేఫ్‌లో చాలా మంది ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకువ‌చ్చారు. మంటలు చెలరేగడంతో కేఫ్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఫ్లేర్ గన్ ఉపయోగించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రష్యాలోని వినోద ప్రదేశంలో పైరోటెక్నిక్‌లు ఘోరమైన అగ్నిప్రమాదం జరగడం ఇది మొదటిసారి కాదు. 2009లో పెర్మ్ నగరంలోని లేమ్ హార్స్ నైట్‌క్లబ్‌లో ఎవరో బాణాసంచా పేల్చడంతో చెలరేగిన మంటల్లో 150 మందికి పైగా మరణించారు.

Next Story