ఫిలిప్పీన్స్‌లో అతి భారీ వర్షాలు.. 13 మంది మృతి, 23 మంది గల్లంతు
13 dead, 23 missing in Philippines floods. ఎడతెరిపి లేని భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ దేశం అతలాకుతలం అవుతోంది. ఆగకుండా వర్షం
By అంజి
ఎడతెరిపి లేని భారీ వర్షాలు, వరదలతో ఫిలిప్పీన్స్ దేశం అతలాకుతలం అవుతోంది. ఆగకుండా వర్షం కురుస్తుండటంతో వరదలు పోటెత్తుతున్నాయి. క్రిస్మస్ పండుగ రోజు నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల వల్ల 13 మంది మృతి చెందారు. మరో 23 మంది మత్స్యకారులు గల్లంతయ్యారని దేశ విపత్తు నిర్వహణ మండలి తెలిపింది. ఈ విపత్తు దేశంలో విధ్వంసం సృష్టించడమే కాకుండా 45,000 మందికి పైగా ప్రజలను ఆశ్రయం కోసం పునరావాస కేంద్రాల్లోకి నెట్టింది.
తప్పిపోయిన మత్స్యకారులు ప్రతికూల వాతావరణంతో ప్రమాదాలు ఉన్నప్పటికీ సముద్రంలోకి వెళ్లారని విపత్తు ఏజెన్సీ తెలిపింది. భారీ వరదల వల్ల నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో రోడ్లు కొట్టుకుపోయి..రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. వేడి, చల్లని గాలులు కలిసి భారీ మేఘాలను ఏర్పరచడం వల్ల కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు.
స్థానిక మీడియా ప్రకారం.. మంగళవారం పొంగిపొర్లుతున్న నదుల వల్ల పన్నెండు రోడ్లు మునిగిపోయాయి. ప్రభావిత ప్రాంతంలోని 20కి పైగా ప్రదేశాలలో ఇప్పటికీ విద్యుత్ లేదు. దేశ వాతావరణ బ్యూరో, ఫిలిప్పీన్ అట్మాస్ఫియరిక్, జియోఫిజికల్, ఆస్ట్రోనామికల్ సర్వీసెస్ ప్రకారం.. వెచ్చగా, చల్లగా ఉండే గాలులు కలిసి భారీ వర్షపు మేఘాలు ఏర్పడటానికి దారితీశాయని, ఫలితంగా భారీ వర్షాలు, ఆ తర్వాత ఆకస్మిక వరదలు సంభవించాయని తెలిపింది. రెస్క్యూ ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. వ్యవసాయంపై ప్రభావం తీవ్రత అంచనా వేయబడుతోంది.