కాల్పుల మోత.. మెక్సికో స్ట్రీట్ సెలబ్రేషన్స్‌లో 12 మంది మృతి

మెక్సికోలోని గ్వానాజువాటోలో వీధి వేడుకల సందర్భంగా జరిగిన సామూహిక కాల్పుల్లో 12 మంది మరణించారు.

By Knakam Karthik
Published on : 26 Jun 2025 9:00 AM IST

International News, Mexico, opened fire, street celebration, Viral Video

కాల్పుల మోత..మెక్సికో స్ట్రీట్ సెలబ్రేషన్స్‌లో 12 మంది మృతి

మెక్సికోలోని గ్వానాజువాటోలో వీధి వేడుకల సందర్భంగా జరిగిన సామూహిక కాల్పుల్లో 12 మంది మరణించారు. గుయానుయాటో రాష్ట్రంలోని ఇరాపుయాటో నగరంలో బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 12 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ పండుగ సందర్భంగా స్థానికులు వీధిలో నృత్యాలు చేస్తూ, మద్యం సేవిస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సమయంలో గుర్తుతెలియని దుండగులు ఓసారిగా అక్కడికి చేరి కాల్పులు ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి. వీడియోల్లో ప్రజలు అరుస్తూ, పరుగులు తీస్తూ తప్పించుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.

ఈ ఘటనపపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షైన్‌బౌమ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాగా, ఇటీవలే అదే రాష్ట్రంలోని శాన్ బార్టోలో డే బెరియోస్ ప్రాంతంలో క్యాథలిక్ చర్చ్ నిర్వహించిన ఓ పార్టీపై జరిగిన కాల్పుల్లో ఏడుగురు మరణించారు.

మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్న గ్వానాజువాటో, చాలా సంవత్సరాలుగా మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. అక్కడి నేరస్థులు మాదకద్రవ్యాల అక్రమ రవాణా మార్గాలు మరియు ఇతర అక్రమ వ్యాపారాలపై పోరాడుతూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో 1,435 హత్యలు నమోదయ్యాయి, ఇది ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని సంఖ్య కంటే రెట్టింపు.

Next Story