పోలీస్‌స్టేషన్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి, 40 మందికిపైగా గాయాలు
పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. స్వాత్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి) పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన
By అంజి Published on 25 April 2023 7:00 AM IST
పోలీస్‌స్టేషన్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి, 40 మందికిపైగా గాయాలు
పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. స్వాత్‌లోని కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ (సిటిడి) పోలీసు స్టేషన్‌లో సోమవారం జరిగిన పేలుళ్లలో కనీసం 12 మంది పోలీసు అధికారులు మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు చెప్పారని జీయో టీవీ రిపోర్ట్ చేసింది. పోలీస్ స్టేషన్ లోపల జరిగిన రెండు పేలుళ్లలో భవనం పూర్తిగా ధ్వంసమైందని పోలీసులు తెలిపారు. భద్రతా అధికారులు ప్రావిన్స్ అంతటా "అత్యంత అప్రమత్తంగా" ఉన్నారని ఖైబర్ పఖ్తున్ఖ్వా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అక్తర్ హయత్ ఖాన్ తెలిపారు.
పేలుడు ఆత్మాహుతి దాడి కాదని, మందుగుండు సామాగ్రి, మోర్టార్ షెల్స్‌ను నిల్వ ఉంచిన ప్రదేశంలో పేలుడు జరిగిందని సీటీడీ డీఐజీ ఖలీద్ సోహైల్ జియో న్యూస్‌తో చెప్పారు. పోలీస్ స్టేషన్‌పై ఎలాంటి దాడి, కాల్పులు జరగలేదని చెప్పారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని, కేసును విచారించేందుకు బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు పేలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నాయని ఆయన తెలిపారు. కూలిన భవనం పాతదేనని, చాలా కార్యాలయాలు, సిబ్బంది కొత్త భవనంలో ఉన్నారని సీటీడీ డీఐజీ తెలిపారు.
భవనం కుప్పకూలడం వల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడిందని, దీని పరిధిని ఇంకా నిర్ణయించలేదని ఆయన తెలిపారు. ఇంతలో, ప్రాంతీయ ఆరోగ్య విభాగం స్వాత్‌లోని ఆసుపత్రులలో అత్యవసర పరిస్థితిని విధించింది. అంతకుముందు, జిల్లా పోలీసు అధికారి షఫీ ఉల్లా గండాపూర్ (DPO) "ఆత్మహత్య దాడి" జరిగిందని పేర్కొన్నారు. దాడి ఆరోపణలపై స్పందిస్తూ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పేలుడును ఖండించారు. ప్రాణాలు కోల్పోయినందుకు విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించినట్లు రేడియో పాకిస్థాన్ చెప్పిందని జియో న్యూస్ తెలిపింది.