ఇండోనేషియా దేశంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బొగ్గు గనిలో పేలుడు సంభవించి 10 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లో సవహ్లుంటో జిల్లాలోని ప్రైవేట్ యాజమాన్యంలోని గనిలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పది మంది మైనర్లు మరణించగా, మరో నలుగురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మీథేన్‌తో సహా వాయువులు పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించింది.
800 అడుగుల పొడవున ఉన్న గని కావడంతో సహాయక చర్యలు ఆలస్యం అయ్యాయి. ఎక్కువ మందికి కాలిన గాయాలు కావడంతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో మరణించినట్లు అధికారులు చెప్పారు.
ఖనిజాలు అధికంగా ఉన్న ఆగ్నేయాసియా ద్వీపసమూహంలో మైనింగ్ ప్రమాదాలు సర్వసాధారణం. నిరుపయోగంగా మారిన గనుల్లో మిగిలి ఉన్న ధాతువు కోసం ప్రజలు ఎలాంటి భద్రతా పరికరాలు లేకుండానే గనుల్లోకి వెలుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో బోర్నియో ద్వీపంలోని గనిలో కొండచరియలు విరిగిపడడంతో కనీసం ఏడుగురు మరణించారు.
ఏప్రిల్‌లో ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని అక్రమ బంగారు గనిలో 12 మంది మైనర్లు కొండచరియలు విరిగిపడి మరణించారు.