దక్షిణ కెన్యాలో జరిగిన బస్సు ప్రమాదంలో పది మంది మరణించారు. వీరంతా సన్నిహిత మిత్రుని అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్నారు. బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో 10 మంది మరణించారు. ఈ మేరకు ఆదివారం పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టైటా తవేటా కౌంటీలోని మ్వాటెట్ ప్రాంతంలో అంత్యక్రియలకు హాజరైన తర్వాత.. శనివారం సాయంత్రం తీరప్రాంత నగరమైన మొంబాసాకు తిరిగి వస్తున్నారు.
మ్వాటెట్ పోలీసు చీఫ్ మోరిస్ ఓకుల్ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. బస్సు డ్రైవర్ ప్రమాదం నుండి బయటపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉన్నందున ఆసుపత్రిలో చేర్పించారు. "బస్సులో 34 మంది ఉన్నారని.. ప్రాణాలతో బయటపడినవారు మాకు చెప్పారు" అని ఓకుల్ చెప్పారు. కెన్యాలో 15 సంవత్సరాల వయస్సు వరకు పిల్లలు తరచుగా వారి తల్లిదండ్రుల ఒడిలో ప్రయాణిస్తారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఓకుల్ బస్సు బ్రేకులు ఫెయిల్ అయ్యాయని చెప్పారు. అయితే.. బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జాఫెత్ కూమ్ తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.