భారీ హిమపాతం.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు
పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శనివారం హిమపాతం సంభవించడంతో కనీసం 10 మంది మరణించారు.
By అంజి Published on 28 May 2023 6:04 AM GMTభారీ హిమపాతం.. 10 మంది మృతి, 25 మందికి గాయాలు
పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శనివారం హిమపాతం సంభవించడంతో కనీసం 10 మంది మరణించారు. 25 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వత ప్రాంతంలోని ఆస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో జరిగిన ఈ విపత్తులో ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. "స్థానికుల సహాయంతో రెస్క్యూ పని ప్రారంభించబడింది. తరువాత పాకిస్తాన్ ఆర్మీ సైనికులు కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నారు" అని పోలీసులు తెలిపారు. గిల్గిత్-బాల్టిస్థాన్ చీఫ్ సెక్రటరీ మొహియుద్దీన్ వానీ ఈ దుర్ఘటనను ధృవీకరించారు. బాధిత ప్రాంతంలో రెస్క్యూ టీమ్‌లు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రాణనష్టంపై గిల్గిత్-బాల్టిస్థాన్ ముఖ్యమంత్రి ఖలీద్ ఖుర్షీద్ ఖాన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
సహాయక చర్యలను ప్రారంభించాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనపై తక్షణమే పరిశీలించాలని సెక్రటరీ ఇంటీరియర్, జిబిడిఎంఎ (గిల్గిట్ బాల్టిస్తాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ) డైరెక్టర్ జనరల్, ఇతర అధికారులను ఆయన కోరారు. హిమపాతంలో విలువైన ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒక ట్వీట్‌లో తీవ్ర విచారం వ్యక్తం చేశారు, వాతావరణ మార్పుల ప్రభావాల వల్ల పాకిస్తాన్‌లో ఇటువంటి సంఘటనలు పెరుగుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఈ హానికరమైన ప్రభావాల నుండి రక్షించడానికి ప్రపంచం మొత్తం తన బాధ్యతను నిర్వర్తించవలసి ఉంది అని అన్నారు.