లాక్‌డౌన్ వేళ ఏపీలో ఆసక్తికర భేటీ..
By Newsmeter.Network Published on 9 April 2020 10:24 AM ISTఒకపక్క కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తోంది. ఏపీలోనూ రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. లాక్‌డౌన్ విధించడంతో ఒకవేళ బయటకు వచ్చినా పోలీసులు తిరిగి పంపించేస్తున్నారు. ఇంట్లో ఉండి ఏ ఛానల్‌లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా కరోనా గురించే చర్చ. ఇలాంటి సందర్భంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర భేటీ సాగింది. రాయలసీమ జిల్లాలకు చెందిన కీలక నేతలు ముగ్గురు ఒకే చోట భేటీ అయ్యారు. రెండు గంటలపాటు చర్చించారు. వారు ఏ విషయాలపై చర్చించారన్న విషయంపై క్లారిటీ లేకపోయినా వారి మధ్య రాజకీయ అంశాలపైనే చర్చ సాగిందని విస్తృత ప్రచారం సాగుతుంది.
Also Read :జీవితంలో ఎన్నో నేర్పిన ‘లాక్‌డౌన్’
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డితో బీజేపీ ఎంపీ సిఎం రమేష్, కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు భేటీ అయ్యారు. వీరి భేటీ రహస్యంగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం జూటూరు వద్ద ఉన్న జేసీ ఫామ్ హౌస్‌లో జరిగింది. సుమారు రెండుగంటల పాటు జరిగిన ఈ భేటీలో రాయలసీమ జిల్లాల్లోనే కాకుండా ఏపీ వ్యాప్తంగా రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి, బీటెక్ రవిలను బీజేపీలోకి ఆహ్వానించేందుకు సీఎం రమేష్ వారితో భేటీ అయ్యారని సమాచారం. ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డిపై జగన్‌మోహన్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే జేసీ దివాకర్ రెడ్డి బస్సులను సీజ్ చేయించడం జరుగుతుందని, రాజకీయ కక్షకు పాల్పడుతూ జేసీతో పాటు తమను వైకాపా నేతలు ఇబ్బందులకు గురిచేస్తున్నారని జేసీ వర్గీయులు పులువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీలో ఉటే మరిన్ని ఇబ్బందులు తప్పవనే భావనలోనూ జేసీ వర్గీయులు పలువురు పేర్కొటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి, బలమైన పార్టీగా ఉన్న బీజేపీలోకి చేరడం ద్వారా జగన్ ప్రభుత్వం, వైకాపా నేతల ఆగడాలకు అడ్డుకట్ట వేయవచ్చని జేసీ వర్గీయుల భావన.
Also Read : హెల్త్ బులిటెన్: దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని పాజిటివ్ కేసులు
ఇదిలా ఉంటే కడప జిల్లాకు చెందిన బీటెక్ రవిసైతం బీజేపీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో ఉంటే వైకాపా నేతల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భావనలో బీటెక్ రవి, ఆయన వర్గీయులు ఉన్నట్లు కడప జిల్లాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది. వైకాపా కక్షసాధింపు రాజకీయాలను ధీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీని ఆశ్రయించటమే మేలనే భావనలో బీటెక్ రవి ఉన్నట్లు చర్చ సాగుతుంది. ఈ పరిస్థితుల్లో సీఎం రమేష్ వీరిద్దరితో భేటీ కావటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతుండగా, టీడీపీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయని జేసీని పలువురు విలేకరులు ప్రశ్నించగా.. తమ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని, ఇందులో రాజకీయాలు లేవని జేసీ దివాకర్‌రెడ్డి తెలిపారు.
Also Read : కరోనా ఎఫెక్ట్.. వైద్యుడి వినూత్న ఆలోచన..
మరోవైపు బీటెక్ రవి వర్గీయులుసైతం.. కేవలం జేసీ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసేందుకు మాత్రమే జేసీతో భేటీ కావటం జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని వారు పేర్కొంటున్నారు. ముగ్గురు నేతల అనుచరులు వీరి మధ్య రాజకీయంగా ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్నప్పటికీ కరోనా వైరస్ ఉధృతంగా వ్యాపిస్తున్న వేళ.. ఏపీలో లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇండ్లకే పరిమితమైతే.. ఈ ముగ్గురు నేతలు ప్రత్యేకంగా భేటీ కావటం వెనుక రాజకీయ అంశాలే ఉంటాయని ఏపీలోని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి వీరి భేటీ రాబోయే రోజుల్లో ఎలాంటి కీలక నిర్ణయాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.