ఇంటర్ విద్యార్ధులకు ప్రత్యేక వాట్సప్ గ్రూప్.. ఎందుకంటే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 April 2020 8:05 AM ISTకరోనా ధాటికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ ఈ మహమ్మారిని నియంత్రించేందుకు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుపరుస్తున్నారు. ఈ నేఫథ్యంలో చదువుకునే విద్యార్ధుల పట్ల వారికి ఎటువంటి ఆటంకం కలగకుండా తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లు చేస్తుంది.
రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకటి నుండి తొమ్మిదో తరగతి విద్యార్ధులను డైరక్టుగా తర్వాత తరగతిలోకి ప్రమోట్ చేస్తామని.. 10వ తరగతి విద్యార్ధులకు కూడా త్వరలోనే పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. తాజాగా ఇంటర్ విద్యార్ధులకు కూడా ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.
వివరాళ్లోకెళితే.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులు ఎంసెట్, నీట్, జేఈఈ వంటి పరీక్షలకు ప్రీపేర్‌కావడంపై అవగాహన కల్పించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ జిల్లాల ఇంటర్ విద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ విషయమై విద్యార్థులకు సమాచారం ఉండేలా ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేయాలని సూచించారు.
అలాగే.. ప్రవేశపరీక్షల కోసం అందుబాటులో ఉన్న వెబ్‌సైట్లు, యాప్‌లు, ఉచిత పాఠాల తదితర వివరాలను ఎప్పటికప్పుడు ఆ వాట్సాప్ గ్రూపులో పోస్టుచేయాలని తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సేవలను ఉపయోగించుకొనేలా ప్రిన్సిపాల్స్ అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు.