గాలిలో వైరస్ వ్యాప్తి పై డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్తోంది ?
By తోట వంశీ కుమార్ Published on 10 July 2020 7:55 AM GMTప్రపంచ దేశాల్లో తన విశ్వరూపం చూపిస్తూ..ఆర్థికంగా మరింత దెబ్బతీస్తోన్న కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందన్న వాదన కొద్దిరోజులుగా వినిపిస్తోంది. 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుందని చెబుతూ డబ్ల్యూహెచ్ఓకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా వారి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా గాలిలో వైరస్ కణాలు చేరి ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపారు. కరోనా మార్గదర్శకాల్లో గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందన్న విషయాన్ని కూడా చేర్చాలని వారు కోరారు.
కానీ కొంత కాలంగా పరిశోధకులు చేస్తున్న వాదనను డబ్ల్యూహెచ్ ఓ తోసిపుచ్చుతూనే వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో కరోనా రోగులను వెంటిలేటర్లపై ఉంచే సందర్భాల్లోనే వైరస్ వ్యాప్తి చెందుతుందని వాదిస్తోంది. ఆస్ట్రేలియా, అమెరికా కు చెందిన శాస్త్రవేత్తలు మాత్రం కరోనా రోగులు తుమ్మినపుడు, దగ్గినపుడు తుంపర్ల రూపంలో వైరస్ గాలిలో చేరుతుందని వాదిస్తున్నారు.
తాజాగా వారి వాదనను పునః పరిశీలించిన డబ్ల్యూహెచ్ఓ పరిశోధకులు చెప్పిన విషయాన్ని అంగీకరించింది. అయితే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. వాటిలో ముఖ్యంగా రెస్టారెంట్లు, గ్రూప్ సాంగ్స్ పాడే ప్రదేశాలు, జిమ్ లు, యోగా సెంటర్లు ఇలా ఇండోర్ ప్రదేశాల్లోనే వైరస్ గాలి ద్వారా సోకే అవకాశాలున్నట్లుగా పరిశోధకుల అధ్యయనాల్లో తెలుసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. అలాగే ఎలాంటి లక్షణాలు లేని ద్వారా కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందన్న వాదనను డబ్ల్యూహెచ్ఓ కొట్టిపారేసింది. ఏ లక్షణాలు లేకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారి నుంచి వైరస్ వ్యాపించే అవకాశాలు చాలా తక్కువేనని తెలిపింది. ఎక్కువగా దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలున్నవారి నుంచే వైరస్ అధికశాతంలో వ్యాపిస్తుందన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.