కోవిడ్‌తో దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్ మృతి
By న్యూస్‌మీటర్ తెలుగు
కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా విస్తరించింది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక దేశంలో కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఇక దేశ మొదటి మహిళా కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్‌ఐ పద్మావతి (103) కరోనాతో మరణించారు. కరోనాతో ఆమె 11 రోజుల కిందట ఆస్పత్రిలో చేరింది. కాలేయంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె కన్నుమూసినట్లు నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో డాక్టర్ ఓపీ యాదవ్ తెలిపారు. రెండు ఊపిరితిత్తుల్లో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ ఏర్పడినట్లు తెలిపారు.
1917లో మయన్మార్‌లోని బర్మాలో జన్మించిన ఆమె.. 1942లో రెండవ ప్రపంచ యుద్దం సమయంలో భారత్‌కు వలస వచ్చినట్లు అధికారులు వివరించారు. ఆమె రంగూన్ మెడికల్ కాలేజీ నుంచి పట్టభద్రురాలై ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లి ఆ తర్వాత భారత్‌కు తిరిగి వచ్చింది.
కాగా, 1981లో నేషనల్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించగా, 2015వరకు అక్కడే పని చేశారు. వైద్యరంగంలో ఆమె మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా, ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 1967లో పద్మ భూషణ్, 1992లో పద్మ విభూషణ్‌లతో సత్కరించారు. ఆదివారం ఆమె అంత్యక్రియలు ఢిల్లీలోని పంజాబీ బాగ్‌లో నిర్వహించారు.