ప్రజలారా.. కుఛ్ కరోనా..!

By అంజి  Published on  18 March 2020 8:46 AM GMT
ప్రజలారా.. కుఛ్ కరోనా..!

ఒక వైపు ప్రభుత్వం కరోనా వ్యాధిని అరికట్టేందుకు చేయాల్సిందంతా చేస్తోంది. అన్ని రకాల వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు నిర్వహిస్తోంది. కానీ చాలా సందర్భాల్లో ప్రజలు ప్రభుత్వానికి తగినంతగా సహకరిస్తున్నారా? ప్రజల వైపు నుంచి చేయాల్సింది చేస్తున్నారా?

దురదృష్టం ఏమిటంటే కరోనా గురించి అందరూ భయపడుతున్నారు. కానీ కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారా? విషాదం ఏమిటంటే ప్రజలే పూర్తిగా ప్రభుత్వానికి సహకరించడం లేదు. విదేశాల నుంచి వస్తున్న వారికి జ్వరం ఉందా లేదా అన్న విషయాన్ని పరీక్షించేందుకు విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. కానీ జ్వరం ఉన్న వారు సైతం విమానాశ్రయంలో దిగడానికి అరగంట ముందు పారాసిటమాల్ మాత్రలు వేసుకుంటున్నారు. ఫలితంగా జ్వరం తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ తగ్గుతుంది. దీంతో విమానాశ్రయాల్లో థర్మల్ స్కానర్లకు దొరకకుండా తప్పించుకుంటున్నారు. దీని వల్ల ఒరిగేది ఏమిటి? ప్రభుత్వాన్ని మోసపుచ్చినంత మాత్రాన సాధించేదేమిటి? ఇలాంటి వారిలో కరోనా వ్యాధి ఉన్నవారు ఉంటే అది సమాజంలో వ్యాపించదా? దాని వల్ల నష్టం సమాజానికే కదా?

ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలో కొందరు విదేశాలనుంచి వచ్చిన వారికి ఒక పది రోజుల పాటు ఇంటిపట్టునే ఉండమని ప్రభుత్వాధికారులు సలహా ఇచ్చారు. వారు ప్రభుత్వ సలహాను పెడచెవిన పెట్టి పర్యటనలను చేపట్టారు. ఈ విషయం తెలిసిన ప్రభుత్వాధికారులు వారిని ప్రశ్నించారు. దీనికి జవాబుగా వారు “మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. మమ్మల్ని అడ్డుకునేందుకు మీరెవరు?” అని ప్రశ్నించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యం వల్ల సదరు వ్యక్తులు వ్యాధి వ్యాప్తికి తోడ్పడుతున్నారు.

Also Read: క్వారంటైన్ అంటే ఏమిటి ?

ఇంకో ఉదాహరణ!! మన దేశానికి వీఐపీ కల్చర్ ఒక చీడ లాంటిది. సుప్రసిద్ధ బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్. ఆయన భార్య మీరా కపూర్ లకు హఠాత్తుగా జిమ్ కి వెళ్లాలనిపించింది. కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం జిమ్ లన్నిటినీ మూసేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వీఐపీ సెలబ్రిటీకి వ్యాయామం చేయాలనిపిస్తే జిమ్ లు తమంతట తాము తెరుచుకోవాల్సిందే కదా! షాహిద్ ముంబాయిలోని బాంద్రాలో ఉన్న ఒక జిమ్ కి ఫోన్ చేశారు. అంతే.. జిమ్ తలుపులు తెరుచుకున్నాయి. మన హీరో రెండు గంటల పాటు వ్యాయామం చేశారు. ఈ విషయం తెలిసి విలేఖరులందరూ వస్తే ఆయన, ఆయన భార్య వెనక దారి నుంచి పారిపోయారట. “అదేం లేదు.. కేవలం నన్ను కలిసేందుకు వచ్చారు. వారు వ్యాయామం చేయలేదు” అని జిమ్ యజమాని పిల్లికి ఎలుక సాక్ష్యంలా చెప్పారు.

Also Read: కరోనా అనుమానితులను ఉగ్రవాదుల మాదిరిగా పట్టుకుంటున్నారా.? పోలీస్‌ఫోర్స్‌ ఇలా కూడా పనిచేస్తోందా.?

ఇలాంటి బాధ్యతారాహిత్యం ఉంటే మనం కరోనాపై విజయం సాధించగలమా? చైనాలో ప్రభుత్వం 80 కోట్ల మందిని ఇళ్లకు పరిమితం చేసింది. రోడ్లమీద తిరగడంపై ఆంక్షలు విధించింది. జీపీఎస్ సాయంతో ముఖానికి మాస్కులు వేసుకోనివారిని గుర్తించి, హెచ్చరించింది. ఇలాంటి కఠిన చర్యలు చేస్తే తప్ప మన ప్రజలు నియమాలు పాటించరా? లాఠీ భాష మాట్లాడితే తప్ప ప్రజలకు అర్థం కాదా?

Next Story