కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మొదట్లో భారతదేశంలో అంతగా ప్రభావం లేకున్నా.. కొద్దిరోజులుగా కరోనా అనుమానితుల సంఖ్య అలాగే, రోగుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో.. సర్వత్రా భయం నెలకొంది. కరోనా వ్యాధి కలకలం సృష్టిస్తోంది.

అయితే.. కరోనా వ్యాధి కంటే సోషల్‌ మీడియాలో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలే జనాలను మరింత భయపెడుతున్నాయి. పాత ఫోటోలను, కరోనాకు సంబంధం లేని సన్నివేశాలను తీసుకొచ్చి కరోనాతో ముడిపెడుతున్నారు కొందరు సోషల్‌ మీడియా యాక్టివిస్టులు. దీంతో.. గురించి సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించినట్లుగానే భువనగిరిలో ఓ వాట్సప్‌ గ్రూప్‌లో తప్పుడు సమాచారం పోస్ట్‌ చేసిన ఇద్దరు వ్యక్తులతో పాటు.. ఆ వాట్సప్‌ గ్రూప్‌ అడ్మిన్‌ను కూడా అరెస్ట్‌ చేశారు.

ఇప్పుడు తాజాగా ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ వీడియోను పరిశీలిస్తే ఓ రైల్వేస్టేషన్‌లోకి ఎంటరైన సాయుధ పోలీసులు.. ప్లాట్‌ఫామ్‌పై పరుగులు పెడుతున్నారు. రైళ్లలో, ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కొందరిని పట్టుకొని ఉగ్రవాదుల మాదిరిగా బంధిస్తున్నారు.

[video width="400" height="224" mp4="https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-18-at-10.18.09-AM-1.mp4"][/video]

Capture 1 Capture

ఈ వీడియోతో పాటు ఇంగ్లీష్‌లో ఒక రైటప్‌ కూడా సోషల్‌ మీడియాలో తిరుగుతోంది. 'మనమంతా భారతదేశంలో కరోనా వైరస్ గురించి జోకులు వేసుకుంటున్నాం కానీ చైనాలో మాత్రం చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. దయచేసి ఈ వీడియో చూడండి.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి. నివారణ చర్యలు తీసుకోండి.' అనేది ఈ రైటప్‌ సారాంశం. చైనాలో కరోనా తీవ్రత కారణంగా చాలామంది ఆ వీడియోను నిజమే అని నమ్మేస్తున్నారు.

Sap

అయితే.. నిజంగానే కరోనా వ్యాధిగ్రస్తులపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయా ? పోలీస్‌ ఫోర్స్‌ అంతగా పనిచేస్తోందా ? ప్రజలు ఇలాంటి దృశ్యాలు చూసి భయపడటం లేదా ? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వీడియో ఎప్పటిదన్న దానిపై నిజనిర్ధారణ చేస్తే అసలు విషయం తెలిసింది. వాస్తవానికి ఈ వీడియో ఇప్పటిది కాదు.. పైగా చైనాలో జరిగింది అస్సలే కాదు.

వాస్తవానికి ఈ సంఘటన హాంకాంగ్‌లో జరిగింది. 2019 ఆగస్టు 31 వతేదీన ఈ వీడియో రికార్డ్‌ చేశారు. ఆ సమయంలో హాంకాంగ్‌లో చెలరేగిన అల్లర్లలో పలువురు నిరసన కారులు విధ్వంసం సృష్టించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని రైల్వేస్టేషన్‌లోకి వెళ్లి రైలు ఎక్కారు. ఆసమయంలో వాళ్ల దగ్గర పెప్పర్‌స్ప్రేలు కూడా ఉన్నాయని పోలీసులు చెప్పారు. అయితే.. సాయుధ పోలీసులు వాళ్లను పసిగట్టి రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చారు. రైళ్లో దాక్కున్న వాళ్లను వెంబడించి బంధించారు. ఆ సమయంలో 60మందికిపైగా నిరసన కారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇది అంతర్జాతీయ వార్తా వెబ్‌సైట్లలో ప్రచురితమైంది. అందులో భాగంగానే ఈ వీడియోను కూడా పలు ఛానెళ్లలో ప్రసారం చేశారు. ఈకింది లింకులో దీనికి సంబంధించిన సమాచారం చూడొచ్చు.

https://www.scmp.com/video/hong-kong/3025272/chaos-hong-kongs-rail-network-police-chase-protesters-station-beat-people

ప్రచారం : చైనాలో కరోనా వ్యాధిగ్రస్థులను సాయుధ పోలీసు బలగాలు ఉగ్రవాదుల మాదిరిగా వెంటాడి బంధిస్తున్నారు.

వాస్తవం : ఇది 2019 ఆగస్టు 31వ తేదీన హాంకాంగ్‌లో జరిగిన అల్లర్ల సందర్భంగా రికార్డ్‌ చేసిన వీడియో.

కంక్లూజన్‌ : భారత దేశంలో కరోనాను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని, చైనాలో మాత్రం ఇంత భీకర పరిస్థితులు ఉన్నాయన్నది సోషల్‌ మీడియాలో ఈ వీడియోతో పాటు జరుగుతున్న ప్రచారం. కానీ, ఇది వాస్తవం కాదు.

- సుజాత గోపగోని

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story