అదిగో అల్లదిగో.. ఆస్టరాయిడ్..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 11 Aug 2020 8:42 AM ISTచిన్నపాటి బైనాక్యులర్‌తో డాబా పైకెక్కి ఆకాశంలో పాలపుంతల్ని తోక చుక్కల్ని చూసి ఉక్కిరిబిక్కిరయ్యే చిన్నారులు ఎందరో ఉంటారు. కానీ పిడుగుల్లాంటి ఈ ఇద్దరు పిల్లలు అలాంటి అల్పసంతోషులు కాదు. తోకచుక్కల్ని కాదు ఏకంగా ఓ లఘు గ్రహాన్నే చూసేశారు. చదివేది పదో తరగతే అయినా.. వారి ఆలోచన ఆకాశం ఆవలే! గత రెండు నెలలుగా ఇంటి నుంచి టెలిస్కోప్‌లోంచి ఖగోళ రహస్యాలు చేదించే పనిలో ఉన్నారు వారు. ఈ అన్వేషణలోనే వీరి కంట పడింది ఆస్టరాయిడ్ (లఘు గ్రహం). భూకక్ష్యలో కాకుండా అంగారకుడి చుట్టూ తిరుగుతున్న నియోవైజ్ తోకచుక్క గురించి నాసా ప్రపంచానికి పరిచయం చేయకముందే వీరు చూశారు. వైదేహి వెకారియా, రాధిక లఖానీ ఇద్దరు పాన్ స్టార్స్ అనే టెలిస్కోప్ నుంచి అంగారకుడి చుట్టూ తిరగడాన్ని గమనించి యూరేకా అంటూ ఉత్సాహంగా ఎగిరి గంతేశారు! ఇద్దరమ్మాయిల ఆకాశాన్వేషణ గాధ ఇది.
కొన్ని లక్షల కోట్ల దూరంలో ఉన్న ఖగోళాన్ని చూడాలంటే అంతే శక్తిమంతమైన టెలిస్కోప్ కావాలి. మరి ఇంత పవర్‌ఫుల్ టెలిస్కోప్ పదో తరగతి చదివే వీరికి ఎలా లభించిందన్న అనుమానం కలగడం సహజం. ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రామ్ కోసం అంతర్జాతీయ ఆస్ట్రొనామికల్ సెర్చ్ కొలాబరేషన్ అనే బహుళ విశ్వవిద్యాలయాల సంస్థను టెక్సాస్‌లోని హార్డిన్, సిమ్మన్స్ యూనివర్సిటీ ఉమ్మడిగా ఏర్పాటు చేశాయి. వారితో ఒప్పందంలో ఉన్న ఇండియాలోని స్పేస్ ఇండియా ఆస్టరాయిడ్‌ల అన్వేషణ కోసం ఆసక్తి ఉన్న విద్యార్థుల దరఖాస్తులు ఆహ్వానించింది. ఈపోటీలో గుజరాత్‌లోని సూరత్‌లో సవానీ చైతన్య విద్యాక సంకుల్ స్కూలు విద్యార్థులు వైదేహి, రాధికలు విజేతలుగా నిలిచారు.
భూమికి కనుచూపు మేరలో ఉన్న ఆస్టరాయిడ్‌ల అన్వేషణే సెర్ప్ ప్రోగ్రాం లక్ష్యం. కోరోనా వేళ బైటికి రావడానికి వీలు తేదు కాబట్టి వీరిద్దరికి ఇంటి నుంచే అన్వేషించే వెసులుబాటును కల్పించింది స్పేస్ ఇండియా. అయితే మొదట్లో వీరు ఏవేవో ఖగోళ పదార్థాలు చూశారు. అయితే అవేవీ ఆస్టరాయిడ్ కాదు. సహజంగా అయితే తమ శోధనలో ఇంకా పరిణతి రాలేదేమోనని వదిలేయాలి. కానీ ఇద్దరు ఇద్దరే! పట్టుదలతో ఆకాశ రహస్యాలను నిశితంగా పరిశీలించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఓ రోజు వీరికి ఆస్టరాయిడ్ కనిపించింది. అయితే అది ఆస్టరాయిడ్ అవునో కాదో తెలీక ఆ లొకేషన్‌ను నాసా వారికి పంపించారు. వారు మీరు చూసింది ఆస్టరాయిడ్‌నే అని నిర్ధరించగానే ఒక్కసారిగా ఆనందంతో గంతులేశారు.
ప్రస్తుతం దీనికి హెచ్.ఎల్.వి.2514 అని తాత్కాలికంగా పిలవడానికి ఓ పేరు పెట్టారు. దీని కక్ష్యను కనుగొన్నాక అసలు పేరే పెట్టే అవకాశం ఇద్దరమ్మాయిలకు ఇస్తారు. ఆ పేరు మాట ఏంటోగానీ వీరి పేరు మాత్రం మారుమోగిపోయింది. హార్డిన్ సిమ్మన్స్ యూనివర్సిటీ గణిత ప్రొఫెసర్ మిల్లర్ వైదేహి, రాధికలను అభినందిస్తూ ఓ సందేశం పంపారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు చిన్న వయసులోనే నాసా వారితో ప్రయాణం చేస్తున్న వీరిద్దరు పెద్దయ్యాక ఖగోళ శోధనలో మరింత గొప్ప ఆవిష్కరణలు చేస్తారని అందరూ భావిస్తున్నారు. యూఎస్‌లోని నాసా దాకా ఎదగాలన్న ఈ బాల శోధకుల కల కచ్చితంగా నెరవేరుతుందని పలువురు ప్రశంసిస్తున్నారు.