పట్టాలెక్కనున్న 392 ప్రత్యేక రైళ్లు
By సుభాష్ Published on 14 Oct 2020 8:59 AM GMTప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వేశాఖ. దసరా, దీపావళి పండగల దృష్ట్యా ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది రైల్వే. జోన్లవారీగా 392 ప్రత్యేక రైళ్లను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ప్రకటనను కూడా విడుదల చేసింది.
ఈ కొత్త రైళ్లు అక్టోబర్ 20 నుంచి నవంబర్ 30 వరకు నడవనున్నాయి. అయితే వీటి టికెట్ ధరలు కూడా ఎక్కువే ఉంటాయని తెలుస్తోంది. ఈ ప్రత్యేక రైళ్లలో కొన్ని రోజూ నడుస్తుండగా, మరికొన్ని రైళ్లు వారంలో నాలుగు రోజులు, ఇంకొన్ని రైళ్లు వీకెండ్లో నడవనున్నాయి. ఇక ఈ రైళ్లన్నీ గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ కొత్త రైళ్లు నవంబర్ 30 వరకు మాత్రమే నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ రైళ్ల టికెట్ బుకింగ్ విషయంలో పాత రిజర్వేషన్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఎక్కువగా ఏపీ ఎక్స్ ప్రెస్, దురోంటో, రాజధాని, శతాబ్ది కేటగిరికి చెందినవి ఉన్నాయి.