హైదరాబాద్‌ రెయిన్‌ అలర్ట్‌: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు

By సుభాష్  Published on  14 Oct 2020 6:59 AM GMT
హైదరాబాద్‌ రెయిన్‌ అలర్ట్‌: ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవులు

హైదరాబాద్‌ భారీ వర్షంతో జలదిగ్బంధంలో ఉండిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నగరనంలోని పలు కాలనీల్లో వరదనీరు పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లోని ఇళ్లు కూలి 12 మంది వరకు మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో మూడు రోజుల పాటు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గ్రేటర్‌ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఈ రోజు, రేపు సెలవులు ప్రకటించారు అధికారులు. వర్షాలకు శిథిలావస్థలో ఉన్న పలు ఇళ్లు కూలిపోయాయి. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు తోడయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెట్లన్నీ కూలిపోయాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. జీహెచ్‌ఎంసీకి హెల్ప్‌లైన్‌కు 220 చెట్లు కూలిన ఫిర్యాదులు అందాయి. భారీ వర్షం కారణంగా ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సైతం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.

Next Story