కరోనా ఎఫెక్ట్.. ప్లాట్‌ఫాం ధరను భారీగా పెంచేసిన రైల్వేశాఖ
By తోట వంశీ కుమార్ Published on 17 March 2020 6:16 PM ISTకరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తి నియత్రణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పాటు జనసమర్థత ఎక్కువగా ఉంటే షాపింగ్ మాల్స్, పార్కులను మార్చి 31 వరకు మూసివేశాయి. వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వేస్టేషన్లలో ఫ్లాట్‌ఫాం టికెట్ ధరను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ఫ్లాట్‌ఫాం టికెట్ ధర రూ.10 ఉండగా.. రూ.50 పెంచుతున్నట్లు రైల్వేశాఖ ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ సహా ప్రయాణీకులు అధికంగా ఉండే స్టేషన్లలో ఈ ధరలు అమలు చేయనున్నారు. పెంచిన ధర రేపటి నుంచి అమలులోకి రానుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు పెంచిన ధర అమలులో ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది.
రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘దేశంలోని 250 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ. 10 నుంచి రూ. 50కి పెంచనున్నాం. అయితే ఇది తాత్కాలికమే. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. పశ్చిమ రైల్వే ముంబై, వడోదర, అహ్మదాబాద్, రట్లాం, రాజ్‌కోట్, భావ్‌నగర్ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరను రూ.50కి పెంచింది’అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. మంగళవారం భారత్‌లో కొత్తగా 12 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 126కు చేరింది. ఇక ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా దేశంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.