రైల్వే శాఖ కీలక నిర్ణయం..ప్యాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దు..?

By సుభాష్  Published on  16 Aug 2020 3:19 AM GMT
రైల్వే శాఖ కీలక నిర్ణయం..ప్యాసింజర్‌ రైళ్లు పూర్తిగా రద్దు..?

దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం ఎక్స్‌ ప్రెస్‌, ఏసీ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ప్యాసింజర్‌ రైళ్లు మాత్రం పట్టాలెక్కలేదు. అయితే రైల్వే శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జోన్ల వారీగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే రైల్వే శాఖ మాత్రం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్యాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా మార్చేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. రైళ్లు ఎక్కడి పడితే అక్కడ ఆగకుండా పెద్ద పెద్ద స్టేషన్లలో మాత్రమే ఆగేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ప్యాసింజర్‌ రైళ్లు ప్రతీ పది కిలోమీటర్లలో ఆగుతున్నాయి. అదే ప్యాసింజరర్‌ రైళ్లు ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లుగా మారినట్లయితే అవి పట్టణ, నగర స్టేషన్‌లలో మాత్రమే ఆగుతాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ రైల్వేలో మార్పులు, చేర్పుల్లో భాగంగా ప్యాసింజర్‌ రైళ్లను పూర్తిగా తీసేయాలని రైల్వేశాఖ భావిస్తున్నట్లు సమాచారం. కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశాలేమి లేవు. అలాగే ప్యాసింజర్‌ రైళ్లలో జనాలు కిక్కిరిసి ప్రయాణిస్తుండటంతో రకరకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ప్యాసింజర్‌ రైళ్లకు గుడ్‌బై చెప్పనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో దాదాపు 62ప్యాసింజర్‌ రైళ్లున్నాయి. సికింద్రాబాద్‌-రేపల్లె, విశాఖ, విజయవాడ, విశాఖ- మచిలీపట్నం, గుంటూరు-డోన్‌, తిరుపతి-కర్నూలు, హైదరాబాద్‌-గుంతకల్‌ మధ్య చాలా ప్యాసింజర్లు నడుస్తున్నాయి. ఇక ఈ రైళ్లన్నీ ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారితే లక్షలాది మంది పేద ప్రయాణికులకు ఆర్థిక భారం తప్పదు.

రైళ్ల సమయాల్లో మార్పు..

ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేయడమే కాకుండా రైళ్లు సమయాలను కూడా మార్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రైళ్లు సమయానికి వస్తున్నాయన్న గ్యారంటి లేదు. ఏ రైళ్లు చూసినా ఆలస్యం తప్ప సమయానికి వచ్చిందేమి లేదు. ఇక నుంచి రైళ్లు ఖచ్చితమైన సమయం పాటించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it