ఐపీఎల్ లో ఇకపై 'ఆ రెండు' నిబంధనలు

By Newsmeter.Network
Published on : 28 Jan 2020 5:08 PM IST

ఐపీఎల్ లో ఇకపై ఆ రెండు నిబంధనలు

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్) అభిమానులకు శుభవార్త. ఐపీఎల్-2020 సీజన్‌ లో రాత్రి మ్యాచ్‌ సమయాన్ని ముందుకు జరపాలనే ప్రతిపాదనపై గవర్నింగ్‌ కౌన్సిల్‌ వెనక్కి తగ్గింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’, ‘నోబాల్‌’ అంపైరింగ్‌ నిబంధనలను ఈ సీజన్‌ నుంచి ఐపీఎల్ లో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు గవర్నింగ్‌ కౌనిల్స్‌ ఆమోదం తెలిపింది.

ఈ సారి ఐపీఎల్ మార్చి 29 నుంచి మే 24 వరకు జరగనుంది. మ్యాచులు ఎప్పటిలాగానే రాత్రి 8.గంటలకు ప్రారంభమవుతాయని ప్రకటించింది. కొన్ని మ్యాచ్‌ లు నిర్ణీత సమయం కన్నా ఎక్కువ సేపు (అర్థరాత్రి వరకు) కొనసాగుతుండడంతో కొన్ని విమర్శలు వచ్చాయి. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అర్థరాత్రి ఇళ్లకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంతో పాటు మరికొన్ని అంశాలపై బీసీసీఐ సోమవారం సుధీర్ఘంగా చర్చించింది. బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అమలు చేస్తున్న విధంగా ‘కన్‌కషన్‌ సబ్‌స్టిట్యూట్‌’ను అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు గాయపడితే అతని స్థానంలో రిఫరీ విచక్షణ మేరకు అదే తరహా ఆటగాడిని బ్యాటింగ్, బౌలింగ్‌ చేసేందుకు అవకాశం ఇవ్వాలనేదే ఈ నిబంధన. గత ఐపీఎల్‌లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ చివరి ఓవర్లో ముంబై పేసర్‌ మలింగ వేసిన నోబాల్‌ను అంపైర్‌ గుర్తించకపోవడం వివాదానికి దారిన సంగతి తెలిసిందే. దీని పై కెప్టెన్‌ కోహ్లీ తన అసంతృప్తిని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా మరోసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు నోబాల్స్‌ను మాత్రమే చూసేందుకు ఒక టీవీ అంపైర్‌ను ప్రత్యేకంగా నియమిస్తున్నారు.

కాగా ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్, ఫైనల్‌ మ్యాచ్‌లకు ముంబైలోని వాంఖడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది. షెడ్యూల్‌లో రెండు మ్యాచ్‌లు జరిగే రోజులను తగ్గించారు. వీటిని ఐదుకు మాత్రమే పరిమితం చేశారు. ఐపీఎల్‌ ప్రారంభానికి మూడు రోజుల ముందు ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెటర్లంతా కలిసి సహాయ కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ‘ఆల్‌ స్టార్స్‌ మ్యాచ్‌’ ఆడనున్నారు.

Next Story