కేసీఆర్‌ను అభినందిస్తూ లేఖ రాసిన నేవీ వైస్‌ అడ్మిరల్‌

By సుభాష్  Published on  27 Jun 2020 9:09 AM IST
కేసీఆర్‌ను అభినందిస్తూ లేఖ రాసిన నేవీ వైస్‌ అడ్మిరల్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేవీ వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ లేఖ రాశారు. కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి చేసిన సాయనికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు వైస్‌ అడ్మిరల్‌ రెండు పేజీ లేఖ రాశారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏకంగా వంద కిలోమీటర్ల దూరం వెళ్లి కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబాన్ని పరామర్శించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. అలాగే కల్నల్‌ సంతోష్‌ బాబు కుటుంబానికి ఐదు కోట్లు సాయం అందించడం, అలాగే అమరులైన ఇతర జవాన్లకు కూడా తనవంతు సాయం ప్రకటించడం చాలా అభినందనీయమన్నారు.

అలాగే ఏపీలో ఉన్నకోరుకొండ సైనిక్‌ స్కూల్‌ను ఓ సారి సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఎందరో సైనికులను తయారు చేస్తున్న ఈ సైనిక్‌ సంస్థలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. గాల్వన్‌ ఘర్షణలో అమరుడైన సంతోష్‌బాబు అంత్యక్రియలకు కేసీఆర్‌ హాజరు కాలేకపోయినా.. అనంతరం సూర్యాపేటలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. సంతోష్‌బాబు చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను సైతం ఓదార్చి ధైర్యాన్ని నింపారు. కుటుంబానికి ఎల్లప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అమరుడైన కల్నల్‌ సంతోష్‌ భార్యకు గ్రూప్‌-1 ఉద్యోగాన్ని ఇస్తూ నియామకపత్రాన్ని కేసీఆర్‌ అందజేశారు. అలాగే హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్నికూడా సంతోష్‌ భార్యకు అంజదేశారు. ఇక రూ. 5 కోట్ల సాయాన్ని ప్రకటించిన కేసీఆర్‌.. రూ. 4 కోట్లు సంతోష్‌ భార్యకు అందజేయగా, కోటి రూపాయలు ఆయన తల్లిదండ్రులకు చెక్కు రూపంలో అందజేశారు.



Next Story