చైనా యుద్ధనౌకను తరిమికొట్టిన భారత్..!

By అంజి  Published on  4 Dec 2019 6:29 AM GMT
చైనా యుద్ధనౌకను తరిమికొట్టిన భారత్..!

దుందుడుకు చైనా దుస్సాహసాన్ని, దుష్ట పన్నాగాన్ని మన నౌకాదళ వీరులు తిప్పి కొట్టారు. భారత సాగర జలాల్లోకి ప్రవేశించి, గూఢచర్యం నెరపేందుకు ప్రయత్నించిన చైనా యుద్ధ నౌక షి యాన్ 1 ను తరిమి కొట్టారు. మన భద్రత దృష్ట్యా అత్యంత కీలకమైన అండమాన్ నికోబార్ ద్వీప సమూహాలకు చేరువలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఈ యుద్ధ నౌకను మన ప్రత్యేక ఆర్ధిక క్షేత్ర జలాల నుంచి పంపించి వేశారు.

మామూలుగానే చైనా భారత సాగర జలాలను అతిక్రమించి వస్తూ ఉంటుంది. ఏ సమయంలోనైనా ఏడు చైనా నౌకలు ఇలా అతిక్రమణలకు పాల్పడుతూంటాయి. హిందూ మహాసాగరం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం జలాల్లో మన సార్వభౌమత్వాన్ని, ఆధిపత్యాన్ని కాపాడుకునేందుక మన నౌకాదళం నిత్యం అప్రమత్తమై ఉంటుంది. ఇప్పటికే చైనా మన దేశం చుట్టూ బర్మా లోని కోకో ద్వీపం, బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్, మలక్కా జలసంధి, శ్రీలంకలోని హంబన్ తోటా, పాకిస్తాన్ లోని గ్వాదర్, ఆడెన్ ఆఖాతం లోని జిబౌతీ ద్వీపం దాకా అడ్డాలను నిర్మించి, దిగ్బంధనం చేయ చూస్తున్న నేపథ్యంలో నౌకాదళ సామర్థ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉంది. మరో వైపు చైనా పాకిస్తాన్ లు సంయుక్తంగా జనవరి- ఫిబ్రవరి నెలల్లో నౌకాదళ విన్యాసాలను కూడా చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. మరో వైపు హిందు మహాసముద్రం లోని 40 దేశాలతో కలిసి మన దేశం ఇదే సమయంలో మిలన్ పేరిట యుద్ధ విన్యాసాలు నిర్వహించబోతోంది. ఇందులో పాకిస్తాన్, చైనాలు పాల్గొనవు.

చైనాకు రెండు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 33 డిస్ట్రాయర్లు, 54 ఫ్రిగేట్లు, 42 కోర్వెట్లు, పది న్యూక్లియర్ జలాంతర్గాములు, 50 డీజిల్ ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు ఉన్నాయి. మన దేశానికి యుద్ధ నౌకల కొరత చాలా ఉంది. ఈ ఏడాది నౌకాదళ బడ్జెట్ లో పది శాతం కోత విధించడం జరిగింది. మనకు ఒకే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, పది డిస్ట్రాయర్లు, 14 ఫ్రిగేట్లు, 11 కోర్వెట్లు, 15 డీజిల్ ఎలక్ట్రిక్ లు, రెండు న్యూక్లియర్ సబ్మెరీన్లు మాత్రమే ఉన్నాయి. 2027 నాటికి 212 యుద్ధ నౌకలు కావాలని, ఇందుకోసం 16000 కోట్లు కావాలని నౌకాదళం అడిగింది. కానీ చివరికి 172 యుద్ధ నౌకలతోటే సరిపుచ్చుకోవాల్సి వచ్చే సూచనలున్నాయి. నానాటికీ పెరుగుతున్న చైనా దుందుడుకుతనాన్ని అడ్డుకోవాలంటే మన నౌకాదళాన్ని మరింత సన్నద్దం చేయాల్సిందే.

Also Read

Next Story