ఐపీఎల్ ర‌ద్దైతే.. ఆట‌గాళ్ల జీత‌భ‌త్యాల ప‌రిస్థితి ఏంటీ..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2020 3:11 PM GMT
ఐపీఎల్ ర‌ద్దైతే.. ఆట‌గాళ్ల జీత‌భ‌త్యాల ప‌రిస్థితి ఏంటీ..?

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో కొన్ని టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. ఇదిలా ఉంటే.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)2020 మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా

ఏప్రిల్ 15 వ‌ర‌కు వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే.. ఏప్రిల్ 14 వ‌ర‌కు దేశవ్యాప్త లాక్‌డౌన్ ఉండంతో.. ఏప్రిల్ 15 నుంచి ఐపీఎల్ ప్రారంభం అయ్యే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేదు. మ‌రీ ఈ ఏడాది ఐపీఎల్ జ‌ర‌గ‌కుంటే.. ఆట‌గాళ్ల‌కు జీత‌భ‌త్యాలు కూడా సందిగ్థంలో ప‌డతాయి.

ఐపీఎల్‌-13వ సీజ‌న్ వైర‌స్ కార‌ణంగా ర‌ద్ద‌యితే ఇన్సూరెన్స్ వ‌ర్తించ‌ద‌ని, ఆట‌గాళ్ల‌కు జీతాలకు ఇబ్బంది అవుతుంద‌ని భార‌త క్రికెటర్ల సంఘం (ఐసీఎ) చీఫ్ అశోక్ మ‌ల్హోత్రా తెలిపారు. ఒక్కో ప్రాంఛైజీ ఆట‌గాళ్ల జీత‌భ‌త్యాల కోసం రూ.75 నుంచి రూ.85 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంద‌ని, కానీ ప్ర‌స్తుత ప‌రిస్ధితుల్లో ప్రాంచైజీలు ఆ మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేవ‌న్నారు. మ‌రోవైపు ఐపీఎల్ ర‌ద్దు వ‌ల్ల వ‌ర్థ‌మాన ఆట‌గాళ్లు ఎంతో ఇబ్బంది ప‌డ‌తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాదే ఐపీఎల్‌కు ఎంపికై, స‌త్తాచాటాల‌ని భావిస్తున్న ప్లేయ‌ర్ల‌కు తాజా ప‌రిస్థితి ఆశ‌నిపాత‌మే అని తెలిపారు.

ఇదిలా ఉంటే.. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ జీతాల చెల్లింపుల గురించి ఆయ‌న వివ‌రించారు. టోర్నీ ప్రారంభానికి వారం రోజుల ముందు 15 శాతం, టోర్నీ జ‌రుగుతున్న‌ప్పుడు 65 శాతాన్ని చెల్లిస్తార‌ని తెలిపారు. మిగిలిన 20 శాతాన్ని టోర్నీ ముగిసిన త‌రువాత నిర్ణీత గ‌డువులో ఫ్రాంచైజీలు చెల్లిస్తాయ‌ని తెలిపారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వ‌హించ‌లేక‌పోతే, సెప్టెంబ‌ర్ స‌మ‌యంలో జ‌రిపే అవ‌కాశ‌ముంద‌ని అంచనా వేశారు.

Next Story
Share it