దటీజ్ భారత్ ఆర్మీ.. ముగ్గురు చైనీయులను కాపాడిన భారత సైనికులు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 12:39 PM GMT
దటీజ్ భారత్ ఆర్మీ.. ముగ్గురు చైనీయులను కాపాడిన భారత సైనికులు

సరిహద్దుల్లో చైనా సైన్యం తోకజాడిస్తున్న సంగతి తెలిసిందే..! భారత భూభాగాన్ని సొంతం చేసుకోడానికి చైనా సైన్యం ప్రయత్నాలు చేస్తూ ఉండగా వారిని అడ్డుకోడానికి భారత సైన్యం ప్రయత్నిస్తూ ఉంది. మరో వైపు ఆపదలో ఉన్న చైనీయులను ఆదుకున్నారు భారత జవాన్లు..!

శుక్రవారం నాడు సిక్కింలో దారి తప్పిపోయి కనిపించారు చైనాకు చెందిన వాళ్లు. ఇద్దరు మగవాళ్ళు.. మరో మహిళ అందులో ఉన్నారు. వారిని గుర్తించిన సైనికులు తినడానికి తిండి.. చలిని తట్టుకోడానికి గుడ్డలను ఇచ్చి మంచితనాన్ని చాటుకున్నారు. 17500 అడుగుల ఎత్తులో వారు తమ దారి తప్పిపోయి ఉత్తర సిక్కిం ప్రాంతంలో కనిపించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు.

ఆ వాతావరణంలో తిండిలేక తట్టుకుని ఉండగలగడం కష్టమే.. సున్నా కన్నా ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. వారిని చూసిన భారత ఆర్మీ వెంటనే వారి దగ్గరకు వెళ్లి ఆక్సిజన్ ను, తినడానికి తిండి, వెచ్చగా ఉండేలా బట్టలను ఇచ్చారు. మెడికల్ టీమ్ కూడా అక్కడికి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించింది.

సైనికులు వారి కోసం ఆక్సిజన్ సిలిండర్ ను అందిస్తున్న ఫోటో, తినడానికి తిండి ఇస్తుండడాన్ని కూడా గమనించవచ్చు. వారి కారును కూడా భారత సైనికులు రిపేర్ చేయించారు. వారి గమ్యస్థానానికి చేరుకోడానికి సరైన గైడెన్స్ ను కూడా ఇచ్చారు. తమకు సహాయం చేసినందుకు వారు భారత సైనికులకు కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయారు.మరో వైపేమో చైనా సైనికులు అయిదుగురు స్థానికులను అపహరించారని అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే చెబుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఐదుగురు స్థానికులను చైనా సైనికులు అపహరించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నిన్నాంగ్ ఎరింగ్ చెప్పుకొచ్చారు. సుబానాసిరి జిల్లాకు చెందిన ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయని అంటున్నారు.

మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించారు. లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని కొనసాగించాలని రాజ్‌నాథ్ కోరారు.

Next Story