పరీక్షల కోసం స్కూటీపై 1300 కి.మీ ప్రయాణించిన గర్భిణి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Sep 2020 9:52 AM GMT
పరీక్షల కోసం స్కూటీపై 1300 కి.మీ ప్రయాణించిన గర్భిణి

టీచర్ జాబ్ రావాలి.. ఐఏఎస్ అయిపోవాలి.. అంబానీ అంతటి బిజినెస్ మ్యాన్ కావలి.. ఇలా రకరకాల కలలు కనేందుకు నిద్ర పోతే చాలు. కానీ, ఆ కలలను సాకారం చేసుకోడానికి మాత్రం ఎన్నో నిద్ర లేని రాత్రు లు గడపాలి. కలలు కనడం ఈజీనే కానీ ఆ కలలు నిజమయ్యేందుకు కష్టాల కడలిని ఈదాల్సి ఉంటుంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూ గమ్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.

ఝార్ఖండ్ కు చెందిన సోనీ మాంఝీ ఈ పట్టువదలని విక్రమార్కుల కోవలోకే వస్తుంది. ఎలాగైనా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న పట్టుదలే 7 నెలల గర్భిణి అయిన సోనీని కరోనా టైంలోనూ 1300 కిలోమీటర్లు స్కూటర్ పై ప్రయాణించేలా చేసింది. ఆ పట్టుదలే సోనీని ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు (డీఈఐఈడీ) పరీక్షలు రాసేందుకు హోరు వానలో తడుస్తూ.. వరద నీటిలోనూ ప్రయాణించేలా ప్రేరేపించింది.

భార్య కోసం కొండను తవ్వి రోడ్డు వేసిన ధనా మాంఝీ తరహాలో సోనీ భర్త దశరథ్ మాంఝీ అండంతో అష్టకష్టాలు పడి చివరకు సోనీ పట్టుదలతో పరీక్షలు పూర్తి చేసింది. అందుకే, ఆ పరీక్షలు రాసేందుకు ఈ జంటకు ఎదురైన పరీక్షలు ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పట్టువదలని విక్రమార్కురాలు సోనీపై, మరో మాంఝీ దశరథ్ పై ప్రశంసల జల్లు కురుస్తున్నాయి.

ఝార్ఘంగ్ లోని మారుమూల గ్రామంలో సోనీ, దశరథ్ మాంఝీ దంపతులు నివసిస్తున్నారు. తొమ్మిది నెలల కిందటే వారి వివాహమైంది. స్కూల్ డ్రాపవుట్ అయిన దశరథ్..టీచర్ కావాలన్నతన భార్య కలను సాకారం చేసేందుకు కష్టపడుతున్నాడు. మధ్య ప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ప్రాథమిక విద్య డిప్లొమా కోర్సు (డీఈఐఈడీ) చేస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ రెండో ఏడాది పరీక్ష షెడ్యూల్.. చివరకు వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న సమయంలో విడుదలైంది.

ఆ సమయంలో 7 నెలల గర్భిణిగా ఉన్న సోనీ ఎలాగైనా పరీక్షలకు హాజరు కావాలనుకుంది. అయితే, ఝార్ఖండ్ నుంచి గ్వాలియర్ కు 1300 కిలోమీటర్లు ప్రయాణించేందుకు ట్యాక్సీవాళ్లు రూ. 30,000 అడిగారు. కేటరింగ్ సంస్థలో రూ. 9000 నెల జీతానికి పనిచేసే సోనీ భర్త దశరథ్ కు అది చాలా పెద్ద మొత్తం. అందుకే, అష్టకష్టాలు పడైనా సరే మూడు రాష్ట్రాలను దాటుకుంటూ స్కూటీపై గ్వాలియర్ వెళ్లేందుకు ఆ జంట నిర్ణయించుకుంది..

ఆగస్టు 28-30 వరకు మూడు రోజుల పాటు సాగిన వీరి ప్రయాణాంలో ఎన్నో ఒడిదుడుకులు. తన నగలను తాకట్టు పెట్టి రూ.2000 పెట్రోలు ఖర్చులకు ఇచ్చింది. భారీ వర్షాలు, గతుకుల రోడ్లు.. ఏ గుంతలో స్కూటీ పడుతుందో తెలియని పరిస్థితిలో దేవుడిపై భారం వేసి ముందుకు సాగారు. రోడ్లపై మోకాళ్ల లోతు వరద నీటిలొ బండి నడిపాడు దశరథ్. ఒకే రెయిన్ కోట్ ను ఇద్దరూ పంచుకున్నారు.

ఇలా, గ్వాలియర్ చేరుకున్న తర్వాత మొదటి రోజు రోడ్డు పక్కన గార్డెన్ లో, ఆ తర్వాతి రోజు లాడ్జిలో ఆశ్రయం పొందిన ఈ జంట.. తర్వాత 10 రోజులకు గాను రూ.1500 పెట్టి ఓ చిన్న గదిని అద్దెకు తీసుకున్నారు. సెప్టెంబర్ 3న సోని తన మొదటి పరీక్ష రాసింది. ఇంకా ఏడు పేపర్లు ఉన్నాయి. స్కూటీపై అంత దూరం వెళ్లలేమేమో అన్న భర్తకు వెళ్లగలమనే భరోసా ఇచ్చింది సోనీ. ఇంత మంచి భర్త ఉండడం వల్లే ఇదంతా సాధ్యమైందంటోంది సోనీ. తాను చదువుకోలేదని, తన భార్యను చదివిస్తానని అంటున్నాడు దశరథ్. భార్య కోసం కొండను తవ్వి రోడ్డు వేసిన ధనా మాంఝీనే తనకు ఆదర్శమంటున్నాడు దశరథ్ మాంఝీ.

మీడియా ద్వారా ఈ విషయం వైరల్ అయింది. దీనిపై స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.. తక్షణం స్పందించారు. దశరథ్, సోని దంపతులకు అవసరమైన సాయం అందించాలని గ్వాలియర్ కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో, వారికి తక్షణ సాయం కింద రూ. 5000లు అందాయి.

సోనికి అధికారులు యూఎస్‌జీ పరీక్ష చేయించగా.. కడుపులో బిడ్డ సురక్షితంగా ఉందని తేలింది. ఆ దంపతుల తిరుగు ప్రయాణానికి ఎంపీ సర్కార్ విమాన టికెట్లు బుక్ చేసింది. వారి స్కూటీని రైల్వే పార్శిల్ ద్వారా ఝార్ఘండ్ పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఇన్ని కష్టాలు పడ్డ సోనీ భవిష్యత్తులో టీచర్ కావాలని యావత్ భారత దేశం ఆకాంక్షిస్తోంది.

Next Story
Share it