Fact Check : ఈ అద్భుతమైన కట్టడాన్ని రాజరాజ చోళుడు కట్టించాడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 5:04 PM IST
Fact Check : ఈ అద్భుతమైన కట్టడాన్ని రాజరాజ చోళుడు కట్టించాడా..?

భారతదేశంలో ఎన్నో అపురూపమైన కట్టడాలు ఉన్నాయి. ఒక్కో రాజు ఒక్కో తరహా కట్టడాలను భారతదేశంలో కట్టించారు. అసలు టెక్నాలజీ అన్నదే లేని సమయంలో ఎంతో గొప్ప కట్టడాలు ఎలా నిర్మించారా అని కూడా ఇప్పటి తరం ఆశ్చర్యపోతూ ఉంటుంది. 'రాజరాజ చోళుడు తన భార్య కోసం అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడు..? తమిళుల ప్రతిభకు ఇదొక నిదర్శనం' అని తాజాగా తమిళంలో ఓ పోస్టు వైరల్ అవుతోంది

గుజరాత్ లోని చిత్ పూర్ లో రాజ రాజ చోళుడు తన భార్య కోసం దీన్ని నిర్మించాడు. పఠాన్ గ్రామానికి దగ్గరలోనే ఈ నిర్మాణం ఉంది. అప్పట్లో వాళ్లు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారో..? ఇంతగొప్ప కట్టడాలను కట్టగలిగారు.. తమిళుల ప్రతిభను ప్రపంచానికి చాటాలి..! అంటూ పలువురు పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.

నిజ నిర్ధారణ:

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులలో ఉన్న కట్టడాన్ని రాజ రాజ చోళుడు నిర్మించలేదు. ఈ పోస్టులలో చెబుతున్నది 'అబద్ధం'

ఈ ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సరస్వతి నదీ తీరంలో ఉన్న 'రాణి కి వావ్' కట్టడం. గుజరాత్ రాష్ట్రం లోని పఠాన్ లో ఈ కట్టడం ఉంది. అనేకమైన మెట్లతో నిర్మించబడిన ఈ కట్టడం 100 రూపాయల నోటు మీద కూడా ఉంటుంది. యునెస్కో సంస్థ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా 2014లో ప్రకటించింది. యునెస్కో సంస్థ కథనం ప్రకారం 'రాణి కి వావ్' కట్టడాన్ని మరు-గుర్జార వాస్తు శైలిలో నిర్మించారు. నీటి పవిత్రను తెలియజేస్తూ ఈ బావిని ఏడు స్థాయిల్లో నిర్మించారు. 500కు పైగా పెద్ద పెద్ద శిల్పాలు, 1000కి పైగా చిన్న చిన్న శిల్పాలను ఆ కట్టడంపై చెక్కారు.

ఈ కట్టడాన్ని నిర్మించింది రాణీ ఉదయమతి.. 950 సంవత్సరాల కిందట ఆమె తన భర్త భీమ్ దేవ్(1022-63) గుర్తుగా నిర్మించింది. భీమ్ దేవ్ సోలంకి రాజవంశానికి చెందిన వాడు. ఎన్నో మెట్లతో నిర్మించిన ఈ కట్టడానికి 'రాణి కి వావ్' అన్న పేరు వచ్చింది. రాణికి చెందిన మెట్ల బావి అని గుజరాతిలో అర్థం. 1063-1068 మధ్య దీన్ని నిర్మించారు. మరు-గుర్జార నిర్మాణ శైలిలో దీన్ని నిర్మించారు. రాజ రాజ చోళుల నిర్మాణాలు ద్రవిడ శైలిలో ఉండేవి.

Britannica.com కథనం ప్రకారం.. మధ్యయుగ చోళ రాజులలో మొదటి రాజ రాజ చోళుడు 985 నుండి 1014 వరకూ పాలించాడు. ఆయన గొప్ప చోళ రాజుగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన వేంగి(గోదావరి జిల్లాలు), గంగావది సంస్థానాలను తన ఆధీనం లోకి తెచ్చుకున్నాడు. 996 సమయంలో కేరళ(చేర దేశం), శ్రీలంక ఉత్తరభాగం ఆయన పాలించడం మొదలుపెట్టాడు. 1014 సమయానికి రాజరాజ చోళుడు లక్ష ద్వీపం, మాల్దీవులను కూడా పాలించడం మొదలుపెట్టాడు. తంజావూరు లోని బృహదీశ్వర ఆలయాన్ని ఈయన నిర్మించాడు.

చోళులు రాజ్యాలను పాలించినంత కాలం ఆలయ నిర్మాణాలకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పల్లవులు కూడా ఆలయాలను నిర్మించారు. కావేరీ నదీ తీరంలో మొదటి ఆదిత్యుడు శివుడి ఆలయాలను నిర్మించారు. రాజరాజ చోళుడి వారసులు కూడా పెద్ద ఎత్తున ఆలయ నిర్మాణాలు చేపట్టారు. తంజావూరు, గంగైకొండచోళపురంలో ద్రావిడ శైలిలో నిర్మించిన ఆలయాలు ఎంతో ప్రసిద్ధి గాంచాయి. 1009 లో తంజావూరు లోని శివాలయంను పూర్తీ చేశారు. గొప్ప నిర్మాణంగా ఇప్పటికీ ప్రసిద్ధి చెందింది.

Cc

చోళ రాజులు పాలించిన ప్రాంతం.. గుజరాత్ లోని పఠాన్ ప్రాంతానికి సంబంధించిన మ్యాపులను చూడొచ్చు.

రాజరాజ చోళుడు తన భార్య కోసం అద్భుతమైన కట్టడాన్ని గుజరాత్ లో నిర్మించాడన్నది 'అబద్ధం'. ఈ కట్టడాన్ని నిర్మించింది రాణీ ఉదయమతి.. 950 సంవత్సరాల కిందట ఆమె తన భర్త భీమ్ దేవ్(1022-63) గుర్తుగా నిర్మించింది.

Next Story