ఐక్యరాజ్యసమితి ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Jun 2020 5:09 AM GMT
ఐక్యరాజ్యసమితి ఎన్నిక‌ల్లో భార‌త్ విజ‌యం

ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు మరో విజయం దక్కింది. ఐక్యరాజ్య సమితి భద్రతామండలి తాత్కాలిక సభ్యత్యపు ఎన్నికల్లో భారత్‌ విజయం సాధించింది. దీంతో.. ఎనిమిదోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా అవతరించింది. 193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో భారత్ 184 ఓట్లు సాధించింది. భారత్‌తో పాటు, ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించాయి. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ వేడుకలు ఈ అద్బుత విజయానికి వేదికయ్యాయి.

దీంతో రెండేళ్ల పాటు (2021-22) గానూ ఐరాస భద్రతా మండలిలో ఆసియా-పసిఫిక్ రీజన్‌ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ మెంబర్‌గా కొనసాగనుంది. 55 మంది సభ్యులున్న ఆసియా- ఫసిఫిక్‌ గ్రూప్‌ నుంచి కేవలం భారత్‌ ఒక్కటే పోటీ చేసింది. భారత్‌ 1950–51, 1967–68, 1972–73, 1077–78, 1984–85, 1991–92, 2011–22లో భద్రతా మండలిలో ఎనిమిదిసార్లు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితి తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఈ విజయం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అటు ప్రపంచదేశాలు కూడా మెల్లిమెల్లిగా కోవిడ్ 19 మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని కూడా చెప్పాలి.

ఐరాసలో అత్యంత శక్తిమంతమైన విభాగం భద్రతా మండలి. అంతర్జాతీయంగా శాంతి భద్రతల పరిరక్షణను పర్యవేక్షించడంతో పాటు ఆంక్షలు విధించే అధికారం ఉంది. 193 సభ్యదేశాలు సమితో ఉండగా, మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు (అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్), పది తాత్కాలిక సభ్యదేశాలు ఉన్నాయి. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది. మండలిలో ఏదైన నిర్ణయం తీసుకుంటే వాటికి 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. శాశ్వత సభ్యదేశాలకు ‘వీటో’ అధికారం ఉంటుంది.

Next Story
Share it