అప్పటి వరకు కరోనా కేసుల్లో అమెరికాను దాటేస్తాం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Sep 2020 12:36 PM GMT
అప్పటి వరకు కరోనా కేసుల్లో అమెరికాను దాటేస్తాం

చైనాలోని వుహన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్న దేశాలో అమెరికా అగ్ర స్థానంలో ఉంది. ఆతరువాతి స్థానంలో భారత్‌ ఉంది. గత కొద్ది రోజులుగా దేశంలో నిత్యం రికార్డు సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి ఇలాగే కొనసాగితే.. అక్టోబర్‌ మొదటి వారంలోనే అమెరికాను వెనక్కి నెట్టి భారత్‌ అగ్రస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్‌లోని బిట్స్‌ పిలానీ అంచనా వేసింది.

ప్రస్తుతం అమెరికాలో 65,88,825 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. భారత్‌లో 45,62,451 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అక్టోబర్‌ నెల పూర్తి అయ్యే సరికి భారత్‌లో కేసుల సంఖ్య 70లక్షలు దాటే అవకాశాలు లేకపోలేదని తెలిపింది. ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ నోటి మాటగా చెప్పలేదు. అడ్వాన్స్‌డ్‌ స్టాటిస్టికల్‌ టెర్నింగ్‌ టెక్నిక్స్‌ విధానాన్ని ఉపయోగించి ఈ అంచనా వచ్చామని.. అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ టీఎస్‌ఎల్‌ రాధిక చెప్పారు. ఈ పరిశోధన ఫలితాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇన్‌ఫెక్షియస్ డిసీజెస్‌కు పంపినట్టు వివరించారు. దీర్ఘకాలంలో కేసుల సంఖ్యను అంచనా వేసేందుకు మరింత మెరుగైన విధానాన్ని రూపొందిచనున్నట్టు డాక్టర్ రాధిక వివరించారు.

Next Story