జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం చట్ట విరుద్ధమని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షువాంగ్ వ్యాఖ్యానించారు. కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన భూభాగంలోనే తమ భూభాగం కూడా ఉందని, ఇది తమ అధికారానికి సవాలుగా తాము పరిగణిస్తున్నామనీ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత వాతావరణానికి సహకరించాలని భారత్ ను కోరుతున్నాం అని ఆయన పేర్కొన్నారు.

జమ్మూ కశ్మీర్ విభజన పైన చైనా చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పు బట్టింది. ఈ విభజన చట్ట విరుద్ధం అని పేర్కొనడం పై మండిపడుతూ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ప్రకటన జారీ చేశారు.

“మా దేశం ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై ఆసక్తి చూపడం లేదు. భారత దేశ అంతర్గత విషయాలలో చైనా సహా ఇతర దేశాల వ్యాఖ్య ఆశించడం లేదు. భారత సార్వభౌమత్వాన్ని ఇతర దేశాలు గౌరవిస్తాయని మేము ఆశిస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు. చైనా – పాకిస్థాన్ సరిహద్దు ఒప్పందం -1963 కింద చైనాయే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని అక్రమంగా స్వాధిన పరుచుకుందని ఆయన మండిపడ్డారు.

సత్య ప్రియ బి.ఎన్