ఒకరిది సిరీస్ కోసం ఆరాటం.. మరొకరి గెలుపుకోసం పోరాటం
By Newsmeter.Network Published on 29 Jan 2020 5:24 AM GMT
హామిల్టన్ : న్యూజిలాండ్ లో చారిత్రాత్మక టీ20 సిరీస్ ను దక్కించునేందుకు టీమిండియాకు సువర్ణావకాశం. భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపై రెండు సార్లు టి20 సిరీస్‌లు ఆడింది. ఒకసారి 0–2తో, మరోసారి 1–2తో ఓటమి పాలైంది. అయితే ఇప్పుడు మూడో ప్రయత్నంలో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకునే అరుదైన అవకాశం మన జట్టుకు వచ్చింది. మూడో మ్యాచ్ లోనే సిరీస్ ను చేజిక్కించుకుంటే మిగిలిన రెండు టీ20ల్లో ప్రయోగాలు చేసుకునే వీలుంది. కాగా రెండు టీ20ల్లోనూ కీలకమైన టాస్ గెలిచినా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పిచ్‌ను అంచనా వేయలేక బోల్తా పడ్డాడు. అయితే ఇక్కడి సెడాన్ పార్క్‌లో వారికి మంచి రికార్డే ఉంది. ఆడిన తొమ్మిది టీ20ల్లో ఏడు నెగ్గింది. అలాగే భారత్‌తో ఇక్కడ జరిగిన చివరి టీ20లోనూ కివీస్ గెలిచింది. దీంతో ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో నిలవాలని కివీస్ పట్టుదలతో ఉంది.
రోహిత్ రాణించేనా..?
ప్రస్తుతం అందరి దృష్టి ఓపెనర్ కెఎల్ రాహుల్ పైనే ఉంది. గత కొంతకాలంగా ఈ కర్ణాటక బ్యాట్స్ మెన్స్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండు టీ20ల్లోనూ రెండు అర్థశతకాలు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. నాలుగో స్థానాన్ని సుస్థితరం చేసుకునే దిశగా శ్రేయాస్ అయ్యర్ ముందుకు సాగుతున్నాడు. ఈ టీ20లో కూడా వీరిద్దరు మళ్లీ చెలరేగేందుకు సిద్దంగా ఉన్నారు. కోహ్లీ కూడా ఫామ్ లో ఉండడంతో న్యూజిలాండ్ కు కష్టాలు తప్పేలా లేవు.
అయితే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత రెండు మ్యాచ్ లలో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. రోహిత్ రాణించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రోహిత్ కూడా రాణిస్తే టీమిండియాకు తిరుగు ఉండదు. టీమిండియా బౌలింగ్ బాగానే ఉంది. రెండు మ్యాచుల్లో బౌలర్లు మంచి ప్రదర్శనే చేశారు. ఇక బుమ్రా, షమీలు తుది జట్టులో ఖాయం కాగా, ఎప్పటిలాగే చహల్, కుల్దీప్‌లలో ఒకరికే చాన్స్.
విజయం కోసం ఆరాటం..
కివీస్ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కివీస్ కు ఏదీ అచ్చి రావడం లేదు. తొలి మ్యాచ్‌లో 200కు పైగా భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను అప్పగించిన ఆ జట్టు గత మ్యాచ్‌లో విఫలమైంది. బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి కూడా బ్యాటింగ్‌నే కివీస్ నమ్ముకుంది. ఓపెనర్లు గప్టిల్, మన్రోలతో పాటు విలియమ్సన్, టేలర్ జట్టు బ్యాటింగ్ భారం మోయాల్సి ఉంది. ఈ సిరీస్‌లో ఆల్‌రౌండర్‌గా కాకుండా పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా నాలుగో స్థానంలో ఆడిన గ్రాండ్‌హోమ్ ఘోరంగా విఫలమయ్యాడు. గ్రాండ్ హోమ్ నుంచి కివీస్ మేనేజ్‌మెంట్ భారీ ఇన్నింగ్స్ ను ఆశిస్తోంది. మూడో టీ20ని కోల్పోతే ఇక వారికి సిరీస్ గెలిచే చాన్స్ లేదు. అందుకే ఆల్‌రౌండ్‌షోతో భారత్‌కు షాక్ ఇవ్వాలనుకుంటోంది. బ్యాటింగ్ బలంగానే కనిపిస్తున్నా కీలక ఆటగాళ్లు చెలరేగాల్సి ఉంది. అంతకంటే ముందు భారత పేసర్ బుమ్రాను ఎదుర్కోవడం వీరికి సవాల్‌గా మారింది. ఆరంభ, డెత్ ఓవర్లలో అతడు పరుగులను కట్టడి చేస్తుండడంతో కివీస్ కష్టాల్లో పడుతోంది.
పిచ్, వాతావరణం
సెడాన్ పార్క్‌లో సాధారణంగా భారీ స్కోర్లు నమోదవుతుంటాయి. ఇక్కడ జరిగిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 180కి పైగా సగటుతో పరుగులు వచ్చాయి. చివరి రెండు మ్యాచ్‌ల్లో ఛేదనకు దిగిన జట్లు 2, 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడాయి. ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశమున్నా వర్ష సూచన లేదు.