ఇరగదీసిన అయ్యర్.. వీరేంద్రుడి తరువాత అతనే..
By Newsmeter.Network Published on 5 Feb 2020 1:54 PM IST5టీ20ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అదే ఉపులో తొలి వన్డేలో ఇరగదీసింది. హామిల్టన్ వేదికగా సెడాన్ పార్క్ లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేల్లో భారత బ్యాట్స్ మెన్లు శ్రేయస్ అయ్యర్(103; 107 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్(88 నాటౌట్; 64 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) లు రాణించడంతో.. న్యూజిలాండ్ ముందు 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అంతకు ముందు టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా ఫీల్డిండ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. టీమిండియా ఇన్సింగ్స్ ను పృధ్వీ షా, మయాంక్ అగర్వాల్ లు ఆరంభించారు. ఈ మ్యాచ్ ద్వారానే వీరిద్దరూ తొలి సారి పరిమిత ఓవర్ల క్రికెట్ లో అరగ్రేటం చేశారు. తొలి వికెట్ కు వీరిద్దరు 50 పరుగులు జోడించారు. అనంతరం పృథ్వీ షా(20; 21 బంతుల్లో 3 ఫోర్లు) ఔట్ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో మయాంక్ అగర్వాల్ (32; 31 బంతుల్లో 6 ఫోర్లు) పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి(51; 63 బంతుల్లో 6 ఫోర్లు) సమయోచితంగా ఆడాడు. శ్రేయాస్ అయ్యర్ తో కలిసి మూడో వికెట్ కు 102 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అర్థశతకం అనంతరం ఇష్ సోథీ బౌలింగ్ లో కోహ్లి బౌల్డ్ అయ్యాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతి కోహ్లి బ్యాట్‌ను దాటుకుని వెళ్లి వికెట్లను తాకింది.
అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న శ్రేయాస్ కు పుల్ ఫామ్ లో ఉన్న కేఎల్ రాహుల్ జతకలిసాడు. వీరిద్దరు ఆడితూచి ఆడుతూ.. చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. శ్రేయాస్ సింగిల్స్ తో స్ట్రైక్ రొటేట్ చేయగా రాహుల్ ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లోనే రాహుల్ అర్థశతం చేశాడు. ఆ వెంటనే అయ్యర్ తన వన్డే కెరీర్‌లో తొలి శతకాన్ని అందుకున్నాడు. 66 బంతుల్లో 5 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేసుకున్న అయ్యర్.. మరో 35 బంతుల్లో హాఫ్ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. రాహుల్-శ్రేయస్ అయ్యర్‌ల జోడి 136 పరుగులి భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత అయ్యర్ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. చివర్లో కేదార్ జాదవ్ ( 26 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా, గ్రాండ్ హోమ్, ఇష్ సోథీలకు చెరో వికెట్ తీశారు.
సెహ్వాగ్ తరువాత శ్రేయాస్ అయ్యరే..
తన కెరీర్ లో తొలి వన్డే శతకం చేసిన శ్రేయాస్ ఓ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. హామిల్టన్‌లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ మైదానంలో అంతకుముందు వీరేంద్ర సెహ్వాగ్ అజేయంగా 125 పరుగులు చేశాడు. 2009లో సెహ్వాగ్ 125 పరుగులు చేస్తే, 2015లో ధావన్ 100 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఇంతకాలానికి అయ్యర్ శతకం సాధించడంతో పాటు సెహ్వాగ్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ఈ జాబితాలో సెహ్వాగ్, అయ్యర్, ధావన్‌ల తర్వాత స్థానంలో రాహుల్ ఇన్నింగ్స్ ఉంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ అజేయంగా 88 పరుగులు చేశాడు.