మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత
By తోట వంశీ కుమార్ Published on 16 April 2020 5:50 AM GMTవచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కు మిథాలీ సేన అర్హత సాధించింది. 2021లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. మిథాలీరాజ్ నేతృత్వంలోని భారత జట్టు మహిళల వన్డే వరల్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. ఐసీసీ 2017 నుంచి 2020 మహిళల చాంఫియన్ షిఫ్‌ను నిర్వహిస్తోంది.
ఈ మధ్య కాలంలో ప్రతి జట్టు మిగతా జట్లతో సిరీస్ లు ఆడాలి. అయితే.. కరోనా కారణంగా కొన్ని సిరీస్‌లు జరగలేదు. సిరీస్‌లు రద్దైన జట్లకు ఐసీసీ సమాన పాయింట్లు ఇచ్చింది. ఇక భారత జట్టు మూడు సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అయితే.. ఇందులో రెండు సిరీస్‌లు రద్దు కాగా.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పాక్‌తో సిరీస్ ఆడేందుకు భారత జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.
పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు) అగ్రస్థానంలో ఉండగా.. ఇంగ్లాండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా వరల్డ్ కప్ ఆడేందుకు అర్హత సాధించాయి. ఇక పాకిస్థాన్(19), న్యూజిలాండ్(17), వెస్టిండిస్(13) పాయింట్లతో ఉన్నాయి. కాగా.. అతిథ్య హోదాతో న్యూజిలాండ్ కూడా టోర్నీలో డైరెక్టుగా అర్హత సాధించింది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి. కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ టోర్నీ జరగడం అనుమానంగా మారింది.