కరోనా వైరస్‌: టాప్‌-10 జాబితాలో భారత్‌

By సుభాష్  Published on  25 May 2020 11:25 AM IST
కరోనా వైరస్‌: టాప్‌-10 జాబితాలో భారత్‌

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్‌లో కూడా అంతే. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్‌ విధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటి వరకూ భారత్‌లో 1,38,845 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. వీరిలో 57,721 మంది కరోనా బాధితులు కోలుకోగా, 4021 మంది మృతి చెందారు. ఇక 77,103 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసుల విషయంలో భారత్‌ దూసుకెళ్తోంది.

ఇరాన్‌ను దాటేసి భారత్‌ టాప్‌టెన్‌ జాబితాలో చేరిపోయింది. ఇరాన్‌లో ఇప్పటి వరకూ 135,701 కేసులు నమోదు కాగా, భారత్‌లో 138,845 కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో అత్యధికంగా కేసులు నమోదవుతూ మొదటిస్థానంలో మహారాష్ట్ర ఉండగా, రెండో స్థానంలో తమిళనాడు, ఆ తర్వాత గుజరాత్‌, ఢిల్లీలు ఉన్నాయి.

కోయంబేడు లింకులతో తమిళనాడులో కరోనా కోరలు చాస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా 50వేలకుపైగా కేసులతో మొదటిస్థానంలో ఉండగా, తమిళనాడు 16,277 కేసులు, 111 మరణాలు సంభవించాయి. అయితే మొన్నటి వరకూ గుజరాత్‌ రెండో స్థానంలో ఉండగా, ఇప్పుడు తమిళనాడు చేరింది. అటు గుజరాత్‌ రాష్ట్రంలో కూడా కరోనా తీవ్రంగానే ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 14,056 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 858 మంది ప్రాణాలు విడిచారు.

ఇక ఏపీ, తెలంగాణలో కూడా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఏపీలో ఇప్పటి వరకూ 2823 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 56 మంది మృతి చెందారు ఇక అత్యధికంగా కరోనా కేసులు గుంటూరు, కర్నూలు జిల్లాలో నమోదువుతున్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకూ 1854 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 53 మంది మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజు నలుగురు మృతి చెందారు. అయితే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఎలాంటి కేసులు నమోదు కాకపోగా, ఒక్క హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదువుతున్నాయి..

Next Story