లాక్‌డౌన్ పొడిగించే ఆలోచన లేదు.. 1, 071 చేరిన కరోనా కేసులు
By అంజి
ఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించింది. ఏప్రిల్ 14 వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కొందరు వ్యక్తులు లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజుల పాటు పొడిగిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా స్పందించారు. లాక్‌డౌన్ పొడిగించే యోచన ప్రస్తుతానికి ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధరమైనవన్నారు. మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ పొడిగించే ఆలోచన ప్రస్తుతానికి లేదని తెలిపారు.
Also Read: కరోనా కాటుకు బలైన సింగర్..విషాదంలో అభిమానులు
గత మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో భాగంగానే లాక్‌డౌన్‌ను అమలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆంక్షలు కొనసాగుతున్నాయి.
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1071 చేరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 29కి చేరింది. 942 మంది చికిత్స పొందుతున్నారు. మరో 100 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.
మహారాష్ట్రలో 218, కేరళలో 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. కర్నాటక రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85కి చేరింది.