రష్యా వ్యాక్సిన్ వివరాలు.. భారత్ చెంతకు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 26 Aug 2020 7:26 AM GMTకొద్ది వారాల కిందట తాము వ్యాక్సిన్ ను తీసుకుని వచ్చామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించి సంచలనానికి దారి తీశారు. ఇంకా ప్రయోగ దశలోనే ఉన్న వ్యాక్సిన్ విషయంలో పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పలువురు శాస్త్రవేత్తలు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక భారత్ లో కూడా మూడు వ్యాక్సిన్లు తయారవుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో కల్లా ప్రపంచానికి భారత్ గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-5 వివరాలు భారత్ కు చేరాయి.
రష్యా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్-5 సమాచారం తమకు అందిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు. స్పుత్నిక్ 5కు సంబంధించినంత వరకూ ఇండియా, రష్యాలు సమాచార మార్పిడి చేసుకున్నాయి. రష్యా నుంచి ప్రాథమిక సమాచారం తమకు చేరిందని రాజేష్ భూషణ్ తెలిపారు. రష్యా వ్యాక్సిన్ తయారీ విధానం, దాని పనితీరుపై సమాచారం ఇవ్వాలని భారత ఆరోగ్య శాఖ కోరగా ఆ సమాచారాన్ని రష్యా పంపించిందని రాజేష్ భూషణ్ తెలియజేశారు.
సరైన ట్రయల్స్ పూర్తీ కాకుండానే వ్యాక్సిన్ ను దేశంలోని 45 మెడికల్ సెంటర్లలో 40 వేల మంది ప్రజలపై పరిశీలిస్తోంది రష్యా ప్రభుత్వం. నా కుమార్తెకే ఈ వ్యాక్సిన్ ను ఇచ్చారు అని పుతిన్ చెప్పడం కూడా ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలవడంతో చాలా దేశాలు రష్యా వ్యాక్సిన్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు ఇండియాతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటున్న విషయాన్ని విషయాన్ని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. ఆఖరి దశ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించిన తరువాత భారత్ నిర్ణయం తీసుకోనుంది.
1957లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరుపై ఈ టీకాకు స్పుత్నిక్–వి అని నామకరణం చేశారు. స్పుత్నిక్–వి టీకాను గమేలియా పరిశోధన సంస్థ బీవో ఫార్మ్ ఉత్పత్తి చేస్తాయని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో తెలిపారు. టీకాను షరతులతోనే రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు. తొలుత ఈ టీకాను దేశంలోని డాక్టర్లు టీచర్లకు ఇస్తున్నట్లు వివరించారు.2021 జనవరి 1 నుంచి ఈ టీకా ప్రజలకు అందుబాటులో వస్తుందని రష్యా స్టేట్ రిజిస్టర్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.