సెప్టెంబరులో అసలు సినిమా షురూ.. రానున్నదంతా గడ్డుకాలమేనా?

By సుభాష్  Published on  17 July 2020 6:15 AM GMT
సెప్టెంబరులో అసలు సినిమా షురూ.. రానున్నదంతా గడ్డుకాలమేనా?

ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా భారత్ ను సైతం ముప్పతిప్పలు పెడుతోంది. వివిధ దేశాల్లో మాదిరి మౌలిక సదుపాయాలతో పాటు.. ప్రభుత్వం.. ప్రభుత్వ యంత్రాంగం అమలు చేస్తున్న విధానాలు భారత్ లో లేని పరిస్థితి. దీంతో.. కరోనా లాంటి ప్రత్యేక సందర్భంలో చేష్టలుడిగిపోతున్నాయి. కొన్నిచోట్ల కొందరు బాగా పని చేస్తున్నా.. మొత్తంగా చూస్తే పరిస్థితి ఏ మాత్రం బాగోలేని పరిస్థితి.

చేతిలో లక్షలాది రూపాయిలు పట్టుకొని మరీ ఆసుపత్రికి వైద్యానికి వెళితే.. చికిత్స చేసేందుకు ససేమిరా అంటున్నారు. కరోనా కారణంగా అది ఇది అన్నది తేడా లేకుండా అన్ని వ్యవస్థలు దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ఆర్థికవేత్తలు పలువురు మాత్రం రానున్న కాలంలో తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

లాక్ డౌన్ తొలినాళ్లలో ఉన్న జోష్ ఇప్పుడు చాలామందిలో కనిపించని పరిస్థితి. ఉపాధి అవకాశాలు తగ్గిపోవటం.. మహానగరాల్లో ఉండాల్సిన లక్షలాది మంది ఊళ్ల బాట పట్టటం ఒక ఎత్తు అయితే.. వ్యాపార వర్గాలు మాత్రం దిగాలుబడ్డాయి. ఇప్పటికే రెండు దఫాలుగా ఇచ్చిన మారిటోరియం పుణ్యమా అని.. బ్యాంకుల నుంచి సామాన్యులకు ఒత్తిడి లేని పరిస్థితి. దీంతో.. ఆcదాయం బాగా పడిపోయినా.. ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ.. ఇలాంటి పరిస్థితి ఎక్కువకాలం ఉంటే.. పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారుతాయంటున్నారు.

బ్యాంకులకు చెల్లించాల్సిన ఈఎంఐలు సెప్టెంబరు నుంచి షురు కానున్నాయి. అప్పటికి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ ఉన్న రిజర్వులు తగ్గిపోవటం.. ఆదాయాలు వచ్చే అవకాశాలు లేని నేపథ్యంలో కొత్త సమస్యలు తెర మీదకు రావటం ఖాయమంటున్నారు. మార్చి నెలాఖరులో మొదలైన కరోనా వ్యవహారం ఇప్పటికి మూడున్నర నెలలు మాత్రమే గడిచింది. సెప్టెంబరు అంటే.. దగ్గర దగ్గర ఐదు నెలలు దాటి ఆరోనెలలోకి అడుగు పెట్టేస్తుంది. ఇప్పటివరకూ ఏదో రకంగా భరిస్తూ.. మంచి కాలం వస్తుందన్న ఆశతో నష్టాలు వస్తున్నా భరిస్తున్న వ్యాపారులు కఠిన నిర్ణయాలు తీసుకోవటం ఖాయం.

దాంతో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోవటంతో పాటు.. పలు వ్యాపారాలు మూతపడే అవకాశం ఉంది. అదే సమయంలో.. ఇప్పుడున్న పరిస్థితి దగ్గర దగ్గర వచ్చే ఏడాది ఫిబ్రవరి.. మార్చి వరకూ కొనసాగుతుందన్న విషయం మీదా స్పష్టత వచ్చేస్తుంది. దీంతో.. చాలామంది తమకు సంబంధించిన విషయాల్లో అటో ఇటో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. ఇవన్నీ.. మరింత ఇబ్బందికర పరిణామాలకు కారణమవుతాయని చెప్పక తప్పదు. ఇవన్నీ సెప్టెంబరుతో షురూ కావటం ఖాయమని చెప్పక తప్పదు.

Next Story