భారత్‌లో కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 1059 మంది మృతి
By తోట వంశీ కుమార్ Published on 26 Aug 2020 5:29 AM GMTభారత్‌లో కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 1059 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 59,449కి చేరింది. నిన్న ఒక్క రోజే 67,151 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 32,34,474కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 24,67,759 మంది కోలుకోగా.. 7,07,267 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 76శాతానికి చేరగా.. మరణాల రేటు 1.8శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 8,23,992 శాంపిళ్లను పరిక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,76,51,512 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు అమెరికాలో నమోదు అవుతున్నాయి. 59,55,728 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. 36,74,176 కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో కరోనా ఉద్దృతి ఇలాగే కొనసాగితే.. ఈ నెల చివరి నాటికి రెండో స్థానానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.