భారత్‌లో ఉగ్రరూపం దాల్చుతోన్న కరోనా.. 24 గంటల్లో 9,987 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 Jun 2020 10:29 AM IST
భారత్‌లో ఉగ్రరూపం దాల్చుతోన్న కరోనా.. 24 గంటల్లో 9,987 కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా 9వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,987 కేసులు నమోదు కాగా.. 331 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కరోనా మహమ్మారి దేశంలో మొదలైనప్పటి నుంచి ఒక రోజు వ్యవధిలో నమోదైన కేసుల్లో గానీ, మరణాల్లో గానీ ఇదే అత్యధికం. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశంలో 2,66,598 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 7,446 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం నమోదైన కేసుల్లో 1,29,917 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 1,29,215 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. గత వారం రోజుల్లో 1868 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ 5వ స్థానంలో ఉంది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. బ్రెజిల్‌, రష్యా, యూకే ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక అత్యధిక మరణాలు నమోదు అవుతున్న దేశాల్లో 12వ స్థానంలో ఉంది.

Next Story