భార‌త్‌లో ల‌క్షా యాభైవేల కేసులు.. అమెరికాలో ల‌క్ష మ‌ర‌ణాలు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 May 2020 4:32 AM GMT
భార‌త్‌లో ల‌క్షా యాభైవేల కేసులు.. అమెరికాలో ల‌క్ష మ‌ర‌ణాలు

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 56ల‌క్షల‌కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 3ల‌క్ష‌ల మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఇక ఈ మ‌హ‌మ్మారి అమెరికాను చిగురుటాకులా వ‌ణికిస్తోంది. తాజాగా అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య ల‌క్ష దాటింది. ప్ర‌పంచ వ్యాప్తంగా సంభ‌వించిన మ‌ర‌ణాల్లో 28 శాతానికిపైగా ఈ దేశంలోనే న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 17ల‌క్ష‌ల మంది క‌రోనా వైర‌స్ భారీన ప‌డ్డారు. న్యూయార్క్ రాష్ట్రంలో అత్య‌ధికంగా 29వేల‌కు పైగా మంది మృత్యువాత ప‌డ్డారు. అక్క‌డ 3.7ల‌క్ష‌ల మందికి వైర‌స్ సోకింది.

ఇక భార‌త్‌లోనూ ఈ మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 6387 కేసులు న‌మోదు కాగా 170 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 1,51,767కి చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి భారీన ప‌డి 4337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం న‌మోదైన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 64,426 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 83,004 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ‌డిచిన వారం రోజులుగా దేశంలో రోజుకు 6 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. దేశంలో అత్య‌ధిక కేసులు మ‌హారాష్ట్ర‌లో న‌మోదు అవుతున్నాయి. ఇక్క‌డ 54,758 కేసులు న‌మోదు కాగా.. 1792 మంది మృత్యువాత ప‌డ్డారు.

వలస కార్మికుల తరలింపుతో కరోనా వైరస్ పట్టణాల నుంచి గ్రామాలకు విస్తరించిందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేసులు పెరుగుతున్న విధానాన్ని చూస్తే, జూలై నెలాఖరుకి కేసుల సంఖ్య 10 లక్షలకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇండియాలో వైరస్ సామూహిక వ్యాప్తి ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ప్రారంభమైనట్టుగానే భావించవచ్చని సీసీఎంబీ వైరాలజీ నిపుణులు వ్యాఖ్యానించారు.

Next Story