రాకాసి మిడుతలు.. ఎన్ని రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 3:29 PM GMT
రాకాసి మిడుతలు.. ఎన్ని రాష్ట్రాలకు ప్రమాదం పొంచి ఉందంటే..!

ఉత్తర భారతదేశానికి మిడుతల ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం తూర్పు మహారాష్ట్రపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్ని రకాల పంటలపై పడి ఈ మిడుతలు ఇష్టం వచ్చినట్లు భోంచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంటలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉన్నాయి. తూర్పు మహారాష్ట్రలోని నాలుగైదు గ్రామాలపై ఈ మిడుతలు విరుచుకుపడ్డాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు చెందిన అధికారులు క్రిమి సంహారకాలు జల్లుతున్నా వాటి ప్రభావం శూన్యంగానే ఉందని చెబుతున్నారు.

ఎడారి మిడుతలు అమరావతి జిల్లాలో ప్రవేశించాయి.. ఆ తర్వాత వార్ధాలో ప్రవేశించాయి. ఇప్పుడు నాగపూర్ కటోల్ తెహ్సిల్ కు చేరుకున్నాయని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ రవీంద్ర భోసలే తెలిపారు. ఈ మిడుతలు రాత్రి పూట ప్రయాణం చేయడం లేదని.. గాలి దిశను బట్టి ఉదయాన ప్రయాణిస్తున్నాయని అన్నారు. ఈ మిడుతలు పంటలపై తీవ్ర ప్రభావం చూపుతాయని.. పచ్చని ఆకులపై ఇవి వాలి పంట మొత్తాన్ని నాశనం చేస్తాయని తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మథుర జిల్లాలో కూడా మిడుతల ప్రభావం తీవ్రంగా ఉంది. వాటిని ఎదుర్కోడానికి టాస్క్ ఫోర్స్ టీమ్ ను అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

పాకిస్థాన్ ను దాటుకుని వచ్చిన ఈ మిడుతలు రాజస్థాన్ రాష్ట్రాన్ని ఏప్రిల్ 11న దాటేశాయి. కొన్ని మిడుతలు జైపూర్ నగరంలో కూడా కనిపించాయి. 200 లీటర్ల Chloropyriphos(క్లోరోపైరిపోస్)ను నిల్వ ఉంచుకోవాలని, ఇతర జిల్లా వాళ్లకు అమ్మకూడదని మథుర జిల్లా మేజిస్ట్రేట్ సూచనలు జారీ చేసింది. డజనుకు పైగా ట్రాక్టర్లతో స్ప్రేలను జల్లడానికి అధికారులు అధికారులు రెడీగా ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ ను కూడా అధికారులు అలర్ట్ చేశారు.

రాజస్థాన్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం గత వారమే హెచ్చరించింది. ఢిల్లీపై కూడా వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన పౌరులు కొందరు ఇప్పటికే మేము ఎడారి మిడుతలను చూశామని ఫోటోలను పోస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం ఈ మిడుతల దెబ్బకు చాలా నష్టపోయింది. కొన్ని లక్షల హెక్టార్లలో పంటలు నాశనం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది భారతదేశ వ్యవసాయ రంగానికి మిడుతల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లబోతోంది.

ఈ ఏడాది ఎడారి మిడుతల సమస్య అధికంగా ఉందని.. చాలా తొందరగా వచ్చాయి.. అది కూడా పెద్ద ఎత్తున వచ్చాయని నిపుణులు తెలిపారు. మధ్యప్రదేశ్ లోని పన్నా ప్రాంతానికి కూడా చేరుకున్నాయి. తూర్పు ఆఫ్రికాలో వచ్చిన వాతావరణ మార్పుల కారణంగా వీటి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అడ్డు వచ్చిన ఏ పంటనైనా తినేస్తూ ఉండడం ఈ మిడుతల లక్షణం.

Next Story
Share it