లాక్ డౌన్ ఫెయిల్ అయ్యింది.. నెక్ట్స్‌ ఏమి చేయబోతున్నారు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 May 2020 2:05 PM GMT
లాక్ డౌన్ ఫెయిల్ అయ్యింది.. నెక్ట్స్‌ ఏమి చేయబోతున్నారు

కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడంలో తీవ్రంగా ఫెయిల్ అయిందని.. అందుకు నిదర్శనం దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులేనని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈరోజు వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయడంలో అన్ని విధాలుగా విఫలమైందని.. మే నెల ముగిసే సమయానికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయి అన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.



దేశంలో కరోనా కట్టడి కోసం ప్రధాని ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. నాలుగు అంచెలుగా లాక్ డౌన్ ను అమలు చేసినా కూడా ప్రధాని ఆశించిన ఫలితాలు రాలేదని విమర్శించారు. వైరస్ అన్నది విపరీతంగా పెరుగుతున్న దశలో భారతదేశం మాత్రమే లాక్ డౌన్ సడలింపులు చేస్తోందని ఆయన ఆరోపించారు.

తన ట్వీట్ల ద్వారా కూడా మోదీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్ గాంధీ. రెండు నెలల కిందట లాక్ డౌన్ అమలు చేస్తున్నప్పుడు మోదీ మాట్లాడుతూ కరోనా వైరస్ మీద విజయం సాధించడానికి 21 రోజులు చాలు అని అన్నారని.. ఇప్పటికి 60 రోజులు దాటినా.. రోజురోజుకీ కరోనా పెరుగుతోంది తప్ప తగ్గట్లేదని రాహుల్ అన్నారు. లాక్ డౌన్ ద్వారా కరోనాపై విజయం సాధించలేకపోయామని స్పష్టమైందని.. నా ప్రశ్న ఏమిటంటే ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోబోతోంది..? అని రాహుల్ ట్వీట్ చేశారు.



మర్చి 26న మోదీ లాక్ డౌన్ ను అమలు పరుస్తున్నామని ప్రకటించినప్పుడు కేవలం 496 కేసులు మాత్రమే భారత్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆ సంఖ్య 1.4 లక్షలకు చేరుకుంది. ఏప్రిల్ నెల నుండి లాక్ డౌన్ లో భారత ప్రభుత్వం మార్పులు చేసుకుంటూ వస్తోంది. మే నెల పూర్తీ అయ్యే లోపు చాలా వరకూ నిబంధనలను సడలించబోతున్నారు.

వీటిపై రాహుల్ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. భారత్ లో లాక్ డౌన్ ను ఎత్తివేసి.. ఏమి సాధించాలని అనుకుంటున్నారు..? కరోనా మహమ్మారిని అరికట్టడానికి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతోంది..? వలస కూలీలను ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుంది అంటూ ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మల సీతారామన్ తీసుకున్న చర్యలు కూడా అంచనాలను అందుకోలేకపోయాయని అన్నారు రాహుల్.

Next Story