'అమెరికా' అభ్యంత‌రాల‌పై ధీటుగా స‌మాధానం ఇచ్చిన 'భార‌త్‌'

By సుభాష్  Published on  10 Dec 2019 12:04 PM GMT
అమెరికా అభ్యంత‌రాల‌పై ధీటుగా స‌మాధానం ఇచ్చిన భార‌త్‌

ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిషష్టాత్మకంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇంటర్‌నేషన్‌ రిలీజియన్‌ ఫ్రీడమ్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) త‌ప్పుబ‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనిపై విమ‌ర్శ‌లు చేసిన యూఎస్‌సీఐఆర్ ఎఫ్‌పై భార‌త్ ధీటైన స‌మాధానం ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో యూఎస్ సీఐఆర్ఎఫ్ అభ్యంతరాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పౌరసత్వ సవరణ బిల్లుపై అమెరికా ప్యానెల్ చేసిన ప్రకటన సరైంది కాద‌ని భార‌త్ అభిప్రాయ‌ప‌డింది. ఈ విషయంలో దానికి ఎలాంటి అధికారం లేదని స్ప‌ష్టం చేసింది. యూఎస్ సీఐఆర్ఎఫ్ గత రికార్డును పరిశీలిస్తే.. పౌరసత్వ బిల్లు విషయంలో అది చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించలేదని విదేశాంగ శాఖ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఈ విషయంలో అమెరికా కమిషన్‌కు ఉన్న పరిజ్ఞానం పరిమితమని, ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఏమాత్రం లేద‌ని తేల్చి చెప్పింది. అమెరికా కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని భార‌త్ ఘాటైన వ్యాఖ్య‌లు చేసింది.

కాగా అమెరికన్‌ కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన భార‌త్‌.. మతపరమైన మైనారిటీ శరణార్ధుల కష్టాలను తొలగించడం, వారి కనీస మానవ హక్కులను గౌరవించేందుకే ఈ బిల్లు ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. పౌరసత్వ బిల్లు, ఎన్‌ఆర్‌సీల ద్వారా ఏ ఒక్కరి పౌరసత్వానికి విఘాతం క‌ల‌గ‌బోద‌ని పేర్కొంది. పౌర‌స‌త్వ విధానాల‌ను క్ర‌మ‌బద్దీక‌రించే హ‌క్కు అమెరికా స‌హా ప్ర‌తి దేశానికి ఉంటుంద‌ని తెలిపింది.

సోమ‌వారం పార్ల‌మెంట్‌లో పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లు రాజ్యసభలో చర్చకు రానుంది. ఉభయ సభల్లో ఆమోదం పొంది.. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే.. పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులు భారత పౌరసత్వం పొందే అవ‌కాశం ఉంటుంది.

Next Story